తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు: కడియం
వరంగల్: తెలంగాణ బిల్లులోలేని పోలవరం అంశంపై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఏ ఆర్డినెన్స్ తెచ్చినప్పుడే తమ నేత కేసీఆర్ వ్యతిరేకించారని, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీపై వెంకయ్య, చంద్రబాబు కలిసి ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ తేవడం సిగ్గుచేటన్నారు. రెండు ప్రభుత్వాలతో చర్చించి చేపట్టాల్సిన కార్యక్రమాన్ని రెచ్చగొట్టేందుకు వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా నోరు మెదపని చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రకు అన్యాయం జరిగిందనే వాదన తెస్తున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన విద్యుత్ పంపిణీ చేపట్టలేదనే వాదన వెనుక కుట్ర ఉందన్నారు. తాము కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ పోలవరంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.