
'బాబును ఎ1గా చేర్చాలి'
హన్మకొండ(వరంగల్ జిల్లా): ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వజూపిన కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఎ1 దోషిగా చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి బాబును ఏ1 గా చేయాలని కోరారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఇదే కోరుతున్నారు. కత్తి మనిషిని చంపవచ్చని, ఆ కత్తి ఎవరు పట్టుకొన్నారనేది ప్రధానమన్నారు. రేవంత్ లంచం ఇవ్వజూపవచ్చు..అయితే ఇది ఎవరి ప్రోద్భలం ద్వారా జరిగిందో చూడాలన్నారు. రేవంత్‌ను నడిపించిన చంద్రబాబును ఖచ్చితంగా దోషిగా చూడాలన్నారు. పొద్దున లేచి పత్రికలు చూస్తే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉల్టా తెలంగాణ ప్రభుత్వంపై కేసులు పెట్టాలని ఆంధ్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఆంధ్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేటట్లుగా ఎమ్మెల్యేలను కొనాలని చూశారన్నారు. చంద్రబాబు డైరక్షన్‌లోఎమ్మెల్యేలను ఎలా కొనాలో జరిగిన తతంగాన్ని ప్రజలు చూశారన్నారు. చిన్న చిన్న అంశాలకు సీబీఐ విచారణ చేయాలని కోరే చంద్రబాబు ఈ అంశంలో ఎందుకు మౌనంగా ఉన్నారో..? ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చంద్రబాబు చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలు నిబద్దత కలిగిన వారు కాబట్టి వెంటనే ఏసీబీ వారికి ఫిర్యాదు చేశారన్నారు. తాము వారి ఎమ్మెల్యేలపై నిఘా పెట్టినట్లు వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు ఎల్లో మీడాయాలో వార్తలు వస్తున్నాయని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.