వర్సిటీల భౌగోళిక పరిధుల్లో మార్పులు
వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్షలో కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న యూనివర్సిటీల భౌగోళిక పరిధులను మార్చాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. విద్యార్థులు అవసరాల మేరకు దగ్గర్లో ఉన్న యూనివర్సిటీల పరిధిలోకి ఆయా జిల్లాలను తీసుకురావాలన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ వర్సిటీకి దగ్గరగా ఉన్న కాకతీయ వర్సిటీ పరిధిలో ఉందన్నారు. ఇలాంటివి మార్పులు చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన చర్యలపై వీసీలు దృష్టి సారించాలన్నారు. వీసీల నియామకం తర్వాత తొలిసారి వీసీలు, రిజిస్ట్రార్లతో కడియం సమావేశమయ్యారు.
యూనివర్సిటీల్లో విద్యాభివృద్ధి,నిధులు, నియామకాలు, విద్యా సంస్కరణలు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష నిర్వహణవంటి అంశాలపై ఆయన చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ కోర్సులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రీ డిజైన్ చేయాలని వీసీలను ఆదేశించారు. యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు, పీజీ సెంటర్లలో మౌలిక సదుపాయాల కొరతను గుర్తించి, ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలన్నారు. ప్రస్తుతమున్న ఫ్యాకల్టీ, కాంట్రాక్టు, ఇతర పద్ధతుల్లో ఉన్న సిబ్బంది, బోధన, బోధనేతర పోస్టుల అవసరం వంటి వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పారు.
విద్యా ప్రమాణాలపై వీసీలతో కమిటీ...
విద్యా ప్రమాణాలు పెంపునకు సూచనలు, సిఫారసులు చేసేందుకు, కోర్సుల రీడి జైన్‌కు మరో ఇద్దరు వీసీలతోనూ మరో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్రీ కోర్సుల్లో 3.72లక్షల సీట్లుంటే 2.24ల క్షల మంది విద్యార్థులే కాలేజీల్లో చేరుతున్నారన్నారని కడియం చెప్పారు. రాష్ట్రంలోని వర్సిటీలు ప్రపంచంలోని యూనివర్సిటీలతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకోసం మూడేళ్ల కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలన్నారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు వెంకటాచలం, మల్లేశ్ పాల్గొన్నారు.
వీసీలు.. గ్రూపులు కట్టొద్దు
యూనివర్సిటీల్లో వీసీలు గ్రూపులు కట్టకుండా, విద్యా ప్రమాణాలే ప్రధానంగా పనిచేయాలని సూచించారు. పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ వర్సిటీలకు పూర్వ వైభవం తెచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. నైపుణ్యాలు కల్పించే ప్రత్యేక కోర్సులపై ప్రపంచంలో పేరుగాంచిన యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోవాలన్నారు. పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు హేతుబద్ధంగా జరగట్లేదన్నారు. వీటిపై ఇద్దరు వీసీలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒకే పరీక్ష ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టే విషయంలోనూ ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాలని, ఆ తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు.