
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబుల్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యే తేదీ, రాష్ట్రంలో పరీక్షలు మొదలయ్యే తేదీలు వేర్వేరుగా ఉండడంతో.. గందరగోళం తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. 2018 మార్చి 1 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో 2018 ఫిబ్ర వరి 28వ తేదీ నుంచే పరీక్షలు నిర్వహిస్తా మని ఆ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. కానీ తర్వాత ఇరు రాష్ట్రాల ఇంటర్ బోర్డు అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రకటించిన వేర్వేరు షెడ్యూళ్ల ప్రకారం.. ప్రతి సబ్జెక్టు పరీక్ష ముందురోజు ఏపీలో జరిగి, తర్వాతి రోజున తెలంగాణలో జరుగనుంది.
ఇక పరీక్ష ప్రశ్నపత్రాల్లో అది ఏ రాష్ట్ర బోర్డు నిర్వహించే పరీక్ష అనే వివరాలు ఉండవు, కేవలం ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్, సబ్జెక్టు పేరు, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి. దీంతో ఏపీలో జరిగిన పరీక్ష ప్రశ్నపత్రాన్ని చూపుతూ.. అది తెలంగాణలో పేపర్ లీక్‌గా ఎవరైనా ప్రచారం చేస్తే గందరగోళం నెలకొంటుందని అధికారులు భావిస్తున్నారు.