బాల్యం.. వారికి మానని గాయం | Child Labour in Balanagar Bangles Factory | Sakshi
Sakshi News home page

బాల్యం.. వారికి మానని గాయం

Published Tue, Jul 23 2019 11:01 AM | Last Updated on Thu, Jul 25 2019 1:19 PM

Child Labour in Balanagar Bangles Factory - Sakshi

బాలాపూర్‌లో పోలీసులు విముక్తి కల్పించిన బాల కార్మికులు (ఫైల్‌)

సాక్షి సిటీబ్యూరో: నగరంలోని గాజుల తయారీ పరిశ్రమల్లో బాల కార్మికులు మగ్గిపోతున్నారు. పేదరికంలో ఉన్న వారిని గుర్తించి కార్మికులుగా చేర్చుకుని వారిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. ఏడాదికి రెండు సార్లు మొక్కుబడిగా జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాలు చేపట్టి కొంత మంది బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల దాడులు ముగిసిన వెంటనే రూటు మార్చి పిల్లలను తీసుకువచ్చి యథావిధిగా పనులు చేయిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఆడుతూ, పాడుతూ తిరుగుతూ, విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలలు కార్మికులుగా మారిపోతున్నారు. గతంలో ఈ గాజుల పరిశ్రమలు నగరంలోని పాతబస్తీ  ప్రాంతంలో అధికంగా ఉండేవి. అధికారులు ఏటా  దాడులు చేసి బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తుండటం, కేసులు నమోదు చేస్తుండటంతో పరిశ్రమలను గ్రేటర్‌ శివారు ప్రాంతాలైన కాటేదాన్, బాలాపూర్, మైలార్‌ దేవ్‌ పల్లి ప్రాంతాలకు తరలించారు. నగరంలో వందల సంఖ్యలో   గాజుల తయారీ పరిశ్రమలు ఉంటాయని అనధికారిక  అంచనా.

అంతా 16 ఏళ్ల లోపు వారే.....
గాజులకు లప్పం అద్దడం, చమ్కీలు అద్దడానికి బాలలు అయితేనే బాగుటుందని పరిశ్రమల నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే గాజుల తయారీ పరిశ్రమల్లో 8 సంవత్సరాల నుంచి 16 ఏళ్ల లోపు వారే పనిచేస్తున్నట్లు దాడుల్లో తేలింది. బీహార్, ఉత్తర్‌ ప్రదేశ్, ఛత్తీస్‌ గడ్, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలలో కడుపేదరికంలో ఉండి తినడానికి తిండి లేని వారిని కార్మికులుగా చేర్చుకుంటున్నారు. అంతకుముందు పనిచేసినటువంటి వారి ద్వారా లేదా అదే రాష్ట్రాలకు చెందిన బ్రోకర్ల ద్వారా  గుర్తించి వారిని నగరానికి రప్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అడ్వాన్స్‌ రూపంలో కొంత మొత్తంలో చెల్లించి మిగతా జీతాన్ని నెల నెల ఇస్తుంటారు. 8 నుంచి 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నెలకు రూ. 1500, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి రూ.2000, 14 నుంచి 16 లోపు వారికి రూ. 2500 జీతాన్ని చెల్లిస్తున్నారు. 

అనారోగ్యంలో ‘బాల్యం’
బాలలైతే వారికి అదే కంపెనీలలోని గోదాంలలో ఉండటానికి వసతి కల్పించి తినడానికి తిండి పెడితే చాలు ఎన్ని గంటల పాటు అయినా పని చేయించుకోవచ్చనేది పరిశ్రమల నిర్వాహకుల ఆలోచన. గాజులకు  అద్దేటువంటి రసాయనాల వల్ల చిన్నతనంలోనే ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కెమికల్స్‌ను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గాజులకు చేతులతో అద్దడం వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్నారు. పూర్తిగా గాజు సంబంధిత ముడి పదార్ధాలతో కూడి ఉండటం వాటిని గాజుల తయారీ కోసం ఫర్నేస్‌ లో వేడిచేయడం వల్ల బాల కార్మికులు అరోగ్యం పాడవుతుంది. 

ఒకేసారి 54 మందికి విముక్తి.....
బీహర్‌కు చెందిన మహ్మద్‌ అస్లామ్‌ బాలాపూర్‌కు వలస వచ్చి శాహిమ్‌ నగర్‌లో గాజుల పరిశ్రమ నడుపుతున్నాడు. రేణుకాపూర్, అబీద్‌ నగర్, అబ్దుల్లా నగర్‌కు చెందిన మహ్మద్‌ రియాజ్, మహ్మద్‌ అస్సామ్, షేక్‌ హబీబ్, మహ్మద్‌ ముస్లామ్, అస్డర్, నజీమ్‌ అక్రమ్‌ వీరితో మరికొంత మంది బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి బాల కార్మికులను తీసుకువచ్చి గాజుల తయారీ పరిశ్రమలలో పనిచేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆపరేషన్‌ స్మైల్, కార్మిక శాఖ, చైల్డ్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్, ప్రజ్వల స్వచ్చంద సంస్థ సభ్యులతో కలిసి రాత్రి వేళల్లో దాడులు చేసి ఒకేసారి 54 మంది బాల కార్మికులను గుర్తించి వారి చేత పనిచేయిస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేశారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 176 మంది.....
2014 సంÐసంవత్సరంలో 39 మంది, 2015లో అత్యధిక ంగా 282 మంది, 2016 లో 124 మంది 2017 లో 22 మం దిని 2018లో 190 మందిని గుర్తించి వారికి విముక్తి కల్పించారు. అదేవిధంగా 2019లో ఇప్పటి వరకు 176 మంది బాల కార్మికులను కాపాడారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్‌ శాఖ, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారు లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ అధికారు ల మధ్య సమన్వయ లోపం కూడ బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి కారణం అవుతుందనే ఆరోపణులు ఉన్నాయి. 

1098 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు....
బాల కార్మికులు మీ కంట పడినా, ఎక్కడైనా పని చేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్‌ లైన్‌  టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే బాల కార్మిక నిర్మూలన అధికారులు వచ్చి పిల్లాడిని ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు పరుస్తారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్‌ హోమ్‌కు తరలిస్తారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించి పిల్లాడిని బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. ఎవరు లేకపోతే ప్రభుత్వ హాస్టళ్లకు పంపించి విద్యను అందిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement