బాల్య వివాహం అడ్డగింత
వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
పీటల మీద నిలిచిపోరుున పెళ్లి
భీమిని : మండలంలోని వీగాం గ్రామంలో బుధవారం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో పీటల మీద పెళ్లి నిలిచిపోయింది. బెల్లంపల్లి తాళ్లగురిజాల ఎస్సై అనిల్‌కుమార్ కథనం ప్రకారం... వీగాంకు చెందిన 21 సంవత్సరాల అబ్బాయికి, అదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల అమ్మాయితో కుల పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా ఎస్సై అనిల్‌కుమార్, తహశీల్దార్ మల్లయ్య అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు.
వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను వివరించారు. మైనార్టీ తీరే వరకు పెళ్లి జరిపించవద్దని సూచించారు. పెద్దలు ఒప్పుకోవడంతో పీటల మీద పెళ్లి నిలిచిపోయింది. మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.