
'ఈ ఆడపిల్ల మాకొద్దు'
వరంగల్ జిల్లా (చిట్యాల): మొదటి భార్యకు ఇద్దరు కూతుళ్లు. మగ పిల్లాడి కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తొలి కాన్పులో కూతురే జన్మించింది. రెండో సంతానం కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో శిశువును బయట పడేసేందుకు యత్నించగా వైద్యులు, సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది.
చిట్యాల మండలం చైన్‌పాక శివారు అందుకుతండాకు చెందిన భూక్య సమ్మయ్యకు జ్యోతి, రమ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. అదే మండలం గిద్దెముత్తారం గ్రామానికి చెందిన జ్యోతిని సమ్మయ్య పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంధ్య(13), దీపిక(7) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మగపిల్లాడి కోసం కరీంనగర్ జిల్లా మంథని మండలం అన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన రమను రెండో పెళ్లి చేసుకున్నాడు. రమకు మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించగా.. వైష్ణవి అని పేరు పెట్టారు. రెండో కాన్పులో కొడుకు జన్మిస్తాడని ఎంతో ఆశపడ్డారు. అయితే బుధవారం రమ స్థానిక సివిల్ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పాపను బయట పడేసేందుకు యత్నించగా.. డాక్టర్ అరుణ్‌కుమార్, హెడ్‌నర్సు కట్కూరి రాణి, ఫార్మసిస్టు ఉప్పు మల్లికార్జున్, వైద్య సిబ్బంది అడ్డుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లల పోషణ భారమైందని.. ఎవరైన ముందుకొస్తే దత్తత ఇస్తామని సమ్మయ్య, రమ దంపతులు తెలిపారు. ఈ పాపతో గ్రామానికి వెళ్లలేమని, ఎవరైన వచ్చి తీసుకెళ్లే వరకు ఆస్పత్రిలోనే ఉంటామని చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పిల్లలు లేని దంపతులు తమకు పాపను ఇవ్వాలని ప్రాధేయపడుతున్నారు. అయితే చట్టప్రకారం పాపను దత్తత ఇవ్వాలని డాక్టర్ అరుణ్‌కుమార్ వారికి సూచించారు. వైద్య సిబ్బంది చైల్డ్‌లైన్, శిశుసమగ్ర అభివృద్ధి సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.