
క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి
సెమీక్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
బోనకల్: క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ శాంతినిలయంలో శనివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మైపన్‌పాల్ బిషప్‌తో కలసి ఎంపీ జ్యోతి ప్రజ్వలన చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో మూడుసార్లు లేవనెత్తానన్నారు. కేంద్రం సున్నితంగా ఈ అంశాన్ని పక్కనపెట్టిందని, అయినప్పటికీ చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఏసుక్రీస్తు లోకరక్షకుడని, దేశం సుభిక్షంగా ఉండేందుకుగాను ప్రభువు దీవెనలు అందిస్తున్నారన్నారు.