గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ప్రారంభ ముహూర్తం సమీపిస్తుండగా...లాస్ట్ మైల్ కనెక్టివిటీపై స్పష్టత లేకుండాపోయింది. సురక్షిత, పర్యావరణ హితమైన ప్రయాణమని, ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఘనమైన ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. ప్రతి ప్రయాణికుడు ఇంటికి క్షేమంగా చేరేలా ‘ఎల్ అండ్ టీ మెర్రీగో అరౌండ్’ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులు నడుపుతామని ప్రకటించారు. కానీ ఆ దిశగా ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయనేలేదు. బస్సుల ఊసే లేదు...బస్‌బేలు..క్యాబ్ స్టాండ్‌ల నిర్మాణమే పూర్తికాలేదు. మరి ‘మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ ఎలా సాధ్యమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: సురక్షిత, కాలుష్య రహిత, పర్యావరణ హితమైన ప్రయాణ సదుపాయం అన్నారు. ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకొనేందుకు అనువైన ‘లాస్ట్‌మైల్ కనెక్టివిటీ’ ఉంటుందని చెప్పారు. సొంత వాహనాల అవసరం లేకుండా ఎల్ అండ్ టీ మెర్రీ గో అరౌండ్ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులను కాలనీలకు నడుపుతుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సమయంలో జరిగిన ఒప్పందంలో ఇవన్నీ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తున్నా ఈ ఒప్పంద అంశాల అమలుకు చర్యలు కన్పించడం లేదు. ఇప్పటి వరకు మెర్రీ గో అరౌండ్ బస్సుల ఊసే లేదు. సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తిరిగేందుకు బస్‌బేలు, ఆటోస్టాండ్‌లు, క్యాబ్ స్టాండ్‌లు కూడా లేవు. దీంతో మెట్రోరైలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది.
అటకెక్కిన ‘మెర్రీ గో అరౌండ్’ బస్సులు..
మెట్రో నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలోని 64 స్టేషన్ల నుంచి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ సుమారు 840 మినీ బ్యాటరీ బస్సులను నడపాలని ప్రతిపాదించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కాగితాలకే పరిమితమైంది. దీంతో ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, తిరిగి ఇంటి వరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఇస్తుందని భావించిన మెర్రీ గో అరౌండ్ అటకెక్కినట్లయింది. ఇప్పుడు ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేటు ఆటోలు, క్యాబ్‌లు తప్ప మరో సదుపాయం లేదు. మెట్రో స్టేషన్‌లకు సమీపంలోని కాలనీల నుంచి పెద్ద బస్సులను నడపడం తమకు నష్టదాయకమని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోరిక్షాల వల్ల ప్రయాణికులపైన భారం అధికమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో కాలుష్యం గణనీయంగా తగ్గించాలన్న ఉద్దేశంతోనే మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన తెరమీదకు వచ్చిన విషయం విదితమే.
ఇదే క్రమంలో ప్రతి స్టేషన్ వద్ద కాలుష్యానికి తావులేని రీతిలో 13 మెర్రీ గో బస్సుల చొప్పున 20 సీట్ల సామర్థ్యంగల బ్యాటరీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరం రాకపోకలు సాగించేలా చూడాలని నిర్మాణ ఒప్పందం సమయంలో నిర్ణయించారు. ఇదే అంశంపై అశోక్‌లీల్యాండ్ అనే సంస్థతో ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులు అధ్యయనం కూడా చేయించారు. కానీ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణ వ్యయం తడిసిమోపడవుతుందన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ మెర్రీ గో అరౌండ్ బస్సులను నడిపే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భారం ఆర్టీసీపైన పడింది. కానీ మెట్రో స్టేషన్‌ల నిర్మాణం పెద్ద బస్సులు తిరిగేందుకు అనువుగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్రో అందుబాటులోకి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
బెంగళూరు..చెన్నైలలోనూ ఇదే తీరు..
మన పొరుగునే ఉన్న బెంగళూరు, చెన్నై మహానగరాల్లోనూ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు వెళ్లేందుకు మినీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆయా నగరాల్లోనూ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య ఏమాత్రం పెరగడంలేదు. మన నగరంలోనూ ఆయా విభాగాలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో నాగోల్–అమీర్‌పేట్(17కి.మీ), మియాపూర్–ఎస్.ఆర్.నగర్(13కి.మీ)మార్గంలోని 24 స్టేషన్ల నుంచి నిత్యం 15–20 మినీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరాయంగా నడపాలని సిటీజనులు కోరుకుంటున్నారు.
బస్‌బేలు, టర్మినళ్ల కొరత...
ప్రస్తుతం నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మొత్తం 30 కిలోమీటర్‌ల మేర అందుబాటులోకి రానున్న మెట్రో మార్గంలో 24 స్టేషన్‌లు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, స్టేడియం, మెట్టుగూడ, మియాపూర్ వంటి కొన్ని స్టేషన్‌లకు మాత్రమే బస్‌బేలు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, మియాపూర్ స్టేషన్‌ల చుట్టూ తిరిగేందుకు కావలసిన సదుపాయం ఉంది. కానీ కొన్ని స్టేషన్‌లు మాత్రం నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు, దిగేందుకు అనువైన బస్‌బేలు లేక ఇబ్బందిగా ఉన్నట్లు గ్రేటర్ ఆర్టీసీ సర్వే స్పష్టం చేసింది.
♦ ఆర్టీసీ సర్వే ప్రకారం మెట్టుగూడ స్టేషన్ నుంచి మల్కాజిగిరి, లాలాగూడ వైపు రాకపోకలు సాగించేందుకు అనువుగా బస్‌బే ఉంది. కానీ నాగోల్ వైపు వెళ్లే బస్సులు మెట్రో స్టేషన్ వద్ద ఆగేందుకు స్థలం లేదు. అలాగే సికింద్రాబాద్ వైపు కూడా బస్‌బే లేదు. స్టేషన్‌కు కొద్ది దూరంలో బస్టాపు ఉంది. దీంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి నడవాల్సి ఉంటుంది.
♦ సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా ప్రస్తుతం బస్ బే చాలా ఇరుకుగా ఉంది. బస్సులు నిలపడం వల్ల వాహనాల రద్దీ తీవ్రమవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో రైల్వే స్థలంలో బస్‌బేలను విస్తరించి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది.
♦ అలాగే జెన్‌టీయూ నుంచి నిజాంపేట్ వైపు వెళ్లేందుకు, ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వైపు వెళ్లేందుకు బస్సుల రాకపోకలకు అనువుగా బస్‌బేలను విస్తరించాలి. ఈఎస్‌ఐ వద్ద ప్రయాణికులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు స్కై వే అవసరం.
♦ బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద బస్సులు ఆపేందుకు బస్‌బేలు లేవు. నిత్యం వాహనాల రద్దీ, ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి బస్సెకేందుకు బస్టాపు లేదు. ఎక్కడ బస్సులు ఆపినా ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది.
♦ మెట్రో స్టేషన్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. స్టేషన్‌కు రెండు వైపులా నుంచి వచ్చే బస్సులు ఎక్కడ ఆపాలనేది సమస్య.
♦ మైత్రీవనం అతి పెద్ద కూడలి. బేగంపేట్ తరువాత భారీగా రద్దీ ఉండే ప్రాంతం. ఇక్కడ కూడా బస్‌బేలు లేవు.
బెంగళూరు పర్యటనలో ఆర్టీసీ అధికారులు
నగరంలో మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమవనున్న నేపథ్యంలో బెంగళూరులో మెట్రో–సిటీ బస్సు సదుపాయాలపైన అధ్యయనం చేసేందుకు ఆర్టీసీ అధికారులు సోమవారం అక్కడికి బయలుదేరి వెళ్లారు. తమ పర్యటన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల నిర్వహణపై కార్యాచరణ వెల్లడించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ మేనేజర్ కొమరయ్య ‘సాక్షి’ తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment