mini bus service
-
‘పల్లె’వెలుగులెప్పుడో?
ఇల్లెందు : పల్లెల శాపమో..అధికారుల కోపమో.. కానీ నేటికీ అనేక గ్రామాలు పల్లెవెలుగు బస్సులు ఎరుగవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బస్సులు నిండా ప్రయాణికులు ఎక్కక నష్టాలు సంభవిస్తున్నాయని, మినీ బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. అయితే బస్సు ఎరుగని పల్లెలకు ఈ మినీ బస్సులు ఎంతగానో ఉపయోగం... అలాంటి మినీ బస్సులు ఉన్నా పల్లెలకు మాత్రం రావటం లేదు. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇల్లెందు ఒకటి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా గతంలోని ఎర్రబస్సు ఎరుగని పల్లెలు సబ్ డివిజన్‌కు సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పక్కా రహదారుల్లో బస్సు ఎరుగని పల్లెలుండటం విశేషం. ఈ గ్రామాల నుంచి తమ పంట ఉత్పత్తులు తరలించటం, అవసరమైన ఎరువులు తీసుకొని వెళ్లటం, విద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవటానికి పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఒకనాడు మారుమూల పల్లెలకు వెళ్లిన బస్సులు కూడా నేడు ఆ పల్లెలకు వెళ్లటం లేదు. 10 ఏళ్ల క్రితం ఇల్లెందు మండలంలోని అమర్సింగ్తండాకు వెళ్లిన బస్సులు నేడు వెళ్లటం లేదు. గతంలో ప్రైవేట్ బస్సులు తిరిగిన దనియాలపాడు గ్రామానికి బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ధర్మాపురం, పూబెల్లి, రేలకాయలపల్లి, మామిడిగుండాల, లచ్చగూడెం గ్రామాలను బీటీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇల్లెందు నుంచి మాణిక్యారం మీదుగా కొమరారం వరకు మాత్రమే ఏకైక సర్వీసును ప్రవేశపెట్టారు. ఇల్లెందు నుంచి ధర్మాపురం, పూబెల్లి, మొండితోగుల మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నా ఈ రూట్లలో ఆర్టీసీ అధికారులు ఏనాడు పరిశీలన చేయలేదు. ఇల్లెందు బస్టాండ్ పరిధిలోని చీమలపాడు, కామేపల్లి, ఊట్కూరు, పూబల్లి, పూసపల్లి, ధర్మాపురం, మామిడిగుండాల, లచ్చగూడెం, రొంపేడు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. టేకులపల్లి మండలంలో ముత్యాలంపాడు నుంచి తడికెలపూడి, బొమ్మనపల్లి నుంచి కొండెంగులబోడు, మద్రాస్‌తండా, ముత్యాలంపాడు స్టేజీ వరకు పక్కా రహదారులు ఉన్నాయి. అనేక గ్రామాలకు ఇటీవల కాలంలో పీఎంజేఎస్వై, నాబార్డు, ఎల్‌డబ్ల్యూఈ, ఆర్టికల్ 275 కింద పలు గ్రామాలకు పక్కా రహదారులు ఏర్పాటు చేశారు. అయినా ఈ పల్లెల్లో పల్లెవెలుగులు కనిపించటం లేదు. 30 మంది ప్రయాణికులతో కండక్టర్ లేకుండా వెళ్లే మినీ పల్లె వెలుగు బస్సులను ఈ రూట్లతో తిప్పితే ఆర్టీసీకి ఆదాయం, ప్రయాణికులకు ఉపయోగం ఉంటుంది. ఈ దిశగా మినీబస్ సర్వీసులను ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
మినీ బస్.. స్టూడెంట్స్ మిస్!
సాక్షి, మహబూబాబాద్: ఆర్టీసీ మినీ బస్సుల్లో స్టూడెంట్ పాస్‌లు చెల్లుబాటుకావడం లేదు. మినీ పల్లెవెలుగు పేర గ్రామాలకు బస్సులు నడుపుతున్నప్పటికీ పాస్‌లు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థులు నానాఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ఇటీవల రాష్ట్రంలోని 9 రీజియ న్ల పరిధిలో 320 మినీ బస్సులను ప్రవేశపెట్టింది. ఒక్కో బస్సు సీట్ల సామర్థ్యం 30. నాన్ కండక్డర్ సర్వీసు. డ్రైవరే టిమ్ యంత్రంతో టికెట్లు జారీ చేస్తూ మినీ బస్సులను నడిపిస్తున్నారు. పల్లె వెలుగు పేరుతోనే గ్రామాలకు ఈ బస్సులను నడుపుతున్నప్పటికీ స్టూడెంట్ పాసులు చెల్లవంటూ బోర్డులో పెట్టుకొని ఈ బస్సులను తిప్పుతున్నారు. దీంతో విద్యార్థులు ఆర్టీసీ ఆర్డినరీ బస్సు వచ్చేంత వరకు వేచిచూడాల్సి వస్తోంది. కొంద రు చార్జీలు పెట్టు కొని బస్సులు, ఆటోల్లో వస్తున్నారు. ప్రయాణికుల కోసమే.. మినీ బస్సులో ఉండేది 30 సీట్లే. అవి ప్రయాణికులకే కేటాయించాం. విద్యార్థుల కోసం ఆర్డినరీ బస్సులు ఎలాగూ ఉన్నాయి. వాటిలో పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. మినీ బస్సులను ఏర్పాటు చేసినా ఆర్డినరీ పల్లెవెలుగు బస్సులను అలాగే తిప్పుతున్నాం. ట్రిప్పులను కూడా ఏ మాత్రం తగ్గించలేదు. – కె.రవిప్రసాద్, డీఎం, మహబూబాబాద్ ఆటోలో వస్తున్నా.. మాది గార్ల మండలం సీతంపేట. మానుకోటలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నా. రోజూ ఎక్స్‌రోడ్డు వద్దకు వచ్చి బస్సెక్కాలి. గతంలో ఇల్లెందుకు ఆర్డినరీ బస్సులు ఎక్కువ నడిచేవి. ఇప్పుడు మినీ బస్సులు ఎక్కువ తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో స్టూడెంట్ పాస్‌లు చెల్లవంటూ ఎక్కనివ్వటం లేదు. ఆర్డినరీ బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే కాలేజీ సమయానికి వెళ్లలేం. దీంతో చార్జీ పెట్టి ఆటోలో వెళ్తున్నా. – ఎం.సాయికుమార్, ఇంటర్ విద్యార్థి, గార్ల -
అ‘గమ్య’గోచరం!
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ప్రారంభ ముహూర్తం సమీపిస్తుండగా...లాస్ట్ మైల్ కనెక్టివిటీపై స్పష్టత లేకుండాపోయింది. సురక్షిత, పర్యావరణ హితమైన ప్రయాణమని, ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఘనమైన ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. ప్రతి ప్రయాణికుడు ఇంటికి క్షేమంగా చేరేలా ‘ఎల్ అండ్ టీ మెర్రీగో అరౌండ్’ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులు నడుపుతామని ప్రకటించారు. కానీ ఆ దిశగా ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయనేలేదు. బస్సుల ఊసే లేదు...బస్‌బేలు..క్యాబ్ స్టాండ్ల నిర్మాణమే పూర్తికాలేదు. మరి ‘మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ ఎలా సాధ్యమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సురక్షిత, కాలుష్య రహిత, పర్యావరణ హితమైన ప్రయాణ సదుపాయం అన్నారు. ఇంటి నుంచి నేరుగా గమ్యస్థానానికి చేరుకొనేందుకు అనువైన ‘లాస్ట్‌మైల్ కనెక్టివిటీ’ ఉంటుందని చెప్పారు. సొంత వాహనాల అవసరం లేకుండా ఎల్ అండ్ టీ మెర్రీ గో అరౌండ్ (మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు) మినీ బస్సులను కాలనీలకు నడుపుతుందని చెప్పారు. మెట్రో రైల్ నిర్మాణ సమయంలో జరిగిన ఒప్పందంలో ఇవన్నీ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తున్నా ఈ ఒప్పంద అంశాల అమలుకు చర్యలు కన్పించడం లేదు. ఇప్పటి వరకు మెర్రీ గో అరౌండ్ బస్సుల ఊసే లేదు. సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తిరిగేందుకు బస్‌బేలు, ఆటోస్టాండ్లు, క్యాబ్ స్టాండ్లు కూడా లేవు. దీంతో మెట్రోరైలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై నీలినీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. అటకెక్కిన ‘మెర్రీ గో అరౌండ్’ బస్సులు.. మెట్రో నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం కారిడార్లలోని 64 స్టేషన్ల నుంచి నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సుమారు 840 మినీ బ్యాటరీ బస్సులను నడపాలని ప్రతిపాదించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కాగితాలకే పరిమితమైంది. దీంతో ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, తిరిగి ఇంటి వరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఇస్తుందని భావించిన మెర్రీ గో అరౌండ్ అటకెక్కినట్లయింది. ఇప్పుడు ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేటు ఆటోలు, క్యాబ్‌లు తప్ప మరో సదుపాయం లేదు. మెట్రో స్టేషన్లకు సమీపంలోని కాలనీల నుంచి పెద్ద బస్సులను నడపడం తమకు నష్టదాయకమని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు క్యాబ్‌లు, ఆటోరిక్షాల వల్ల ప్రయాణికులపైన భారం అధికమయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో కాలుష్యం గణనీయంగా తగ్గించాలన్న ఉద్దేశంతోనే మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన తెరమీదకు వచ్చిన విషయం విదితమే. ఇదే క్రమంలో ప్రతి స్టేషన్ వద్ద కాలుష్యానికి తావులేని రీతిలో 13 మెర్రీ గో బస్సుల చొప్పున 20 సీట్ల సామర్థ్యంగల బ్యాటరీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరం రాకపోకలు సాగించేలా చూడాలని నిర్మాణ ఒప్పందం సమయంలో నిర్ణయించారు. ఇదే అంశంపై అశోక్లీల్యాండ్ అనే సంస్థతో ఎల్అండ్టీ, మెట్రో అధికారులు అధ్యయనం కూడా చేయించారు. కానీ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణ వ్యయం తడిసిమోపడవుతుందన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ మెర్రీ గో అరౌండ్ బస్సులను నడిపే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భారం ఆర్టీసీపైన పడింది. కానీ మెట్రో స్టేషన్ల నిర్మాణం పెద్ద బస్సులు తిరిగేందుకు అనువుగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే చాలా చోట్ల ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మెట్రో అందుబాటులోకి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు..చెన్నైలలోనూ ఇదే తీరు.. మన పొరుగునే ఉన్న బెంగళూరు, చెన్నై మహానగరాల్లోనూ మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు వెళ్లేందుకు మినీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆయా నగరాల్లోనూ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య ఏమాత్రం పెరగడంలేదు. మన నగరంలోనూ ఆయా విభాగాలు లాస్ట్‌మైల్ కనెక్టివిటీని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. తొలిదశ మెట్రో ప్రాజెక్టులో నాగోల్–అమీర్‌పేట్(17కి.మీ), మియాపూర్–ఎస్.ఆర్.నగర్(13కి.మీ)మార్గంలోని 24 స్టేషన్ల నుంచి నిత్యం 15–20 మినీ బస్సులను సమీప కాలనీలు, బస్తీలకు నిరంతరాయంగా నడపాలని సిటీజనులు కోరుకుంటున్నారు. బస్‌బేలు, టర్మినళ్ల కొరత... ప్రస్తుతం నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు, మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మేర అందుబాటులోకి రానున్న మెట్రో మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, స్టేడియం, మెట్టుగూడ, మియాపూర్ వంటి కొన్ని స్టేషన్లకు మాత్రమే బస్‌బేలు ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, మియాపూర్ స్టేషన్ల చుట్టూ తిరిగేందుకు కావలసిన సదుపాయం ఉంది. కానీ కొన్ని స్టేషన్లు మాత్రం నిత్యం ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు, దిగేందుకు అనువైన బస్‌బేలు లేక ఇబ్బందిగా ఉన్నట్లు గ్రేటర్ ఆర్టీసీ సర్వే స్పష్టం చేసింది. ♦ ఆర్టీసీ సర్వే ప్రకారం మెట్టుగూడ స్టేషన్ నుంచి మల్కాజిగిరి, లాలాగూడ వైపు రాకపోకలు సాగించేందుకు అనువుగా బస్బే ఉంది. కానీ నాగోల్ వైపు వెళ్లే బస్సులు మెట్రో స్టేషన్ వద్ద ఆగేందుకు స్థలం లేదు. అలాగే సికింద్రాబాద్ వైపు కూడా బస్బే లేదు. స్టేషన్‌కు కొద్ది దూరంలో బస్టాపు ఉంది. దీంతో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి నడవాల్సి ఉంటుంది. ♦ సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా ప్రస్తుతం బస్ బే చాలా ఇరుకుగా ఉంది. బస్సులు నిలపడం వల్ల వాహనాల రద్దీ తీవ్రమవుతుంది. దీంతో ఈ ప్రాంతంలో రైల్వే స్థలంలో బస్‌బేలను విస్తరించి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ♦ అలాగే జెన్టీయూ నుంచి నిజాంపేట్ వైపు వెళ్లేందుకు, ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వైపు వెళ్లేందుకు బస్సుల రాకపోకలకు అనువుగా బస్‌బేలను విస్తరించాలి. ఈఎస్ఐ వద్ద ప్రయాణికులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు స్కై వే అవసరం. ♦ బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద బస్సులు ఆపేందుకు బస్‌బేలు లేవు. నిత్యం వాహనాల రద్దీ, ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రయాణికులు మెట్రో స్టేషన్ దిగి బస్సెకేందుకు బస్టాపు లేదు. ఎక్కడ బస్సులు ఆపినా ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. ♦ మెట్రో స్టేషన్ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. స్టేషన్‌కు రెండు వైపులా నుంచి వచ్చే బస్సులు ఎక్కడ ఆపాలనేది సమస్య. ♦ మైత్రీవనం అతి పెద్ద కూడలి. బేగంపేట్ తరువాత భారీగా రద్దీ ఉండే ప్రాంతం. ఇక్కడ కూడా బస్‌బేలు లేవు. బెంగళూరు పర్యటనలో ఆర్టీసీ అధికారులు నగరంలో మెట్రో రైలు రాకపోకలు ప్రారంభమవనున్న నేపథ్యంలో బెంగళూరులో మెట్రో–సిటీ బస్సు సదుపాయాలపైన అధ్యయనం చేసేందుకు ఆర్టీసీ అధికారులు సోమవారం అక్కడికి బయలుదేరి వెళ్లారు. తమ పర్యటన అనంతరం గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల నిర్వహణపై కార్యాచరణ వెల్లడించనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ మేనేజర్ కొమరయ్య ‘సాక్షి’ తో చెప్పారు. -
సిటీలో బస్ జర్నీ.. సో ఈజీ
హైదరాబాద్‌లో మినీ బస్సు సర్వీసులందిస్తున్న కమ్యూట్ ► కి.మీ.కు రూ.3 చార్జీ; రోజుకు 2 వేల మంది ప్రయాణం ► ప్రస్తుతం 75 మినీ బస్సులు; 2 నెలల్లో 200 వాహనాల లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో రోజూ 30 కి.మీ. దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లి రావాలంటే? బస్సులో అయితే గంటల తరబడి ప్రయాణం, సీటుకు నో గ్యారంటీ! పోనీ, ఓలా లేదా ఉబర్ వంటి క్యాబ్‌లను బుక్ చేద్దామంటే సర్‌చార్జీ పేరిట జేబు గుళ్ల! పోనీ, బైక్ మీద వెళ్దామంటే గతుకుల రోడ్లు, ట్రాఫిక్! మరెలా? వీటన్నింటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అందిస్తోంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్.. కమ్యూట్.కామ్. ప్రయాణ సమయం, స్థలం ఎంపిక చేస్తే చాలు.. ఇంటికొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని గమ్య స్థానంలో చేరవేయటం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కమ్యూట్.కామ్ కో–ఫౌండర్ చరణ్ మాటల్లోనే.. కమ్యూట్.కామ్ ఫౌండర్లలో నాతో పాటూ హేమంత్ జొన్నలగడ్డ, ప్రశాంత్ గారపాటి, సందీప్ కాచవరపు, అక్షయ్ చిన్నుపాటి, శృజయ్ వరికుట్టి కూడా ఉన్నారు. 2015 నవంబర్‌లో కమ్యూట్.కామ్ ప్రారంభమైంది. బుకింగ్ చాలా ఈజీ..: కమ్యూట్ బస్‌లో ప్రయాణం బుకింగ్ చేసుకునే విధానం కూడా చాలా సులువు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ముందుగా కమ్యూట్.కామ్‌కు లాగిన్ అయి.. రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత పేరు, ఫోన్ నంబర్, పికప్, డ్రాపింగ్ పాయింట్ల, సమయాన్ని ఎంచుకొని కమ్యూట్ వ్యాలెట్ నుంచి చార్జీలు చెల్లిస్తే చాలు. ఆఫీసు సమయాల్లో అంటే ఉదయం 7 నుంచి 11 మధ్య, సాయంత్రం 5 నుంచి 8 మధ్య ప్రతి 15 నిమిషాలకొక బస్సును నడుపుతున్నాం. మిగిలిన సమయాల్లో అరగంటకొక బస్సు నడుస్తుంది. 50 రూట్లు, 75 మినీ బస్సులు.. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, బాచుపల్లి వంటి నగరం మొత్తం 50 రూట్లలో బస్సులను నడుపుతున్నాం. 12, 15, 21 సీట్ల మినీ బస్సులు 75 వరకూ వున్నాయి. 45 వేల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల మంది మా సేవలను వినియోగించుకున్నారు. రోజుకు 2 వేల మంది మా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 75–80 ఆక్యుపెన్సీ ఉంటుంది. రోజుకు వాహనాలన్నీ కలిపి 6 వేల కి.మీ. తిరుగుతున్నాయి. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. వారం, నెలవారీగా కూడా ప్యాకేజీలుంటాయి. వీటికి ఆఫర్లు, డిస్కౌంట్లుంటాయి. ఏడాది ముగింపు నాటికి నిధుల సమీకరణ.. ప్రతి నెలా 20%ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. ‘‘ఇటీవలే హెచ్2ఓ క్యాబ్స్‌ను కొనుగోలు చేశాం. 2 నెలల్లో 200 వాహనాలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఇప్పటికి 50కే వెంచర్స్ నుంచి రూ.1.3 కోట్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది చివరకల్లా మరో విడత నిధులను సమీకరించనున్నాం. తర్వాతే ఇతర నగరాలకు విస్తరిస్తామని’’ చరణ్ వివరించారు. -
రైట్ రైట్
సాక్షి, చెన్నై:చెన్నైలో పెద్ద బస్సులు వెళ్లలేని మార్గాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మినీబస్సులు నడపనున్నామని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతగా 50 బస్సులు సిద్ధమయ్యూయి స్మాల్బస్ పేరుతో వీటిని నగరంలోని చిన్నచిన్న ప్రాంతాల్ని కలుపుతూ నడిపేందుకు చర్య లు తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మరో 610 బస్సుల్ని కొనుగోలు చేశారు. వీటిని బుధవారం ఉదయం నెహ్రూ స్టేడియంలో జరిగిన వేడుకలో జయలలిత ప్రారంభించారు. డీఎంకే హయూం నుంచి నేటి వరకు ఉద్యోగ విరమణ పొందిన 61,746 మందికి రూ.257 కోట్లతో పింఛన్ అందజేశారు. స్మాల్బస్ రూట్లు ఎస్1:పల్లావరం రైల్వేస్టేషన్-తిరుశూలం శక్తినగర్ మధ్య రెండు, ఎస్2: క్రోంపేట - మేడవాక్కం మధ్య మూడు, ఎస్3: క్రోంపేట-మాడంబాక్కం మధ్య మూడు, ఎస్4: క్రోంపేట-మేడవాక్కం మధ్య మూడు, ఎస్5: పెరుంగళత్తూర్-అరుంగాల్ మధ్య రెండు, ఎస్11: గిండి ఆసార్ కానా - కీల్కట్టాలై మధ్య మూడు, ఎస్12 : గిండి ఆసార్ కానా - ఎన్జీవో కాలనీ మధ్య రెండు, ఎస్13: గిండి - వేళచ్చేరి మధ్య రెండు నడవనున్నాయి. అలాగే ఎస్14 : ఎస్ఆర్పీ టూల్స్-మేట్టుకుప్పం మధ్య మూ డు, ఎస్21:రామాపురం-పోరూర్ మధ్య రెం డు, ఎస్22:పోరూర్-పట్టూర్ మధ్య రెండు, ఎస్23: అయ్యప్పన్‌తాంగల్-కుమరన్ చావడి మధ్య మూడు, ఎస్24: అయ్యప్పన్‌తాంగల్ - తిరువేర్కాడు మధ్య మూడు, ఎస్25: మధురవాయల్ - వలసరవాక్కం మధ్య రెండు, ఎస్31 : వడపళణి - కోయంబేడు బస్సుస్టాండు మధ్య నాలుగు, ఎస్ 32 వడపళణి - తిరువికా పార్కు మధ్య రెండు, ఎస్ 33: అశోక్ పిల్లర్ - మెహతా నగర్ మధ్య రెండు, ఎస్41: అంబ త్తూర్ ఓటీ - మురుగప్పా పాలిటెక్నిక్ మధ్య రెండు, ఎస్ 61: మాధావరం - రెట్టేరి కూడలి మధ్య మూడు, ఎస్ 62: మూలకడై - మనలి మధ్య మూడు స్మాల్ బస్సుల్ని నడపనున్నారు. ఆయా ప్రాంతాల మధ్య ఉన్న చిన్నచిన్న కాలనీ, నగర్లను కలుపుతూ ఈ బస్సులు నడుస్తాయని జయలలిత పేర్కొన్నారు. ఈ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్‌తో సహా 27 మంది పయనించేందుకు వీలు ఉంది. కనిష్ట చార్జీగా రూ.ఐదు, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు. 610 బస్సులు కొత్తగా కొనుగోలు చేసిన 610 బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ విభాగానికి -19, విల్లుపురం డివిజన్‌కు 104 , సేలం డివిజన్‌కు 52, కోయంబత్తూరు డివిజన్‌కు 84, కుంభకోణం డివిజన్‌కు 203, మదురై డివిజన్‌కు 103, తిరునల్వేలి డివిజన్‌కు - 45 బస్సులు కేటాయించారు. అభివృద్ధి మా ఘనతే నెహ్రూ స్టేడియంలో జరిగిన బస్సుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగించారు. రవాణా సంస్థను గత డీఎంకే ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని ధ్వజమెత్తారు. వారి హయూంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ సంస్థ దివాల దశకు చేరుకుందని ఆరోపించారు. అప్పట్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ సైతం మంజూరు చేయకపోవడాన్ని బట్టి చూస్తే సంస్థను ఏ మేరకు భ్రష్టు పట్టించారో అర్థం చేసుకోవచ్చని మండి పడ్డారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక రవాణా సంస్థ బలోపేతమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నానని వివరించారు. ప్రస్తుతం ఈ సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు అమ్మ మినరల్ వాటర్ బాటిళ్లను రూ.పదికే విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మరింతగా చేరువయ్యే రీతిలో స్టాల్స్ సంఖ్య పెంచనున్నామని ప్రకటించారు. ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా మరో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నామని జయలలిత వెల్లడించారు.