సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న హైదరాబాద్ నగర మెట్రోరైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వపరంగా చర్యలు ముమ్మరమయ్యాయి. రైలు మార్గం ఏర్పాటుకు అడ్డంకుగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల అప్పగింతకు గడువు విధించింది. వివిధ ప్రభుత్వ విభాగాలు, హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులతో సచివాలయంలో గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మెట్రో ప్రాజెక్టును గడువు ప్రకారం 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎస్ ఆదేశించారు. ప్రధాన రహదారులపై పనులు జరిగేందుకు వీలుగా మూడు మెట్రో కారిడార్ల పరిధిలో 283 సమస్యాత్మక ఆస్తులను డిసెంబర్ చివరి నాటికి తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు నిర్దేశించారు. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో ప్రస్తుతానికి 45 కి.మీ మార్గంలో పనులు పురోగతిలో ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులు ఆయనకు వివరించారు.
మొత్తం మూడు కారిడార్లలో 65 స్టేషన్లకుగాను 27 స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. నాగోల్-మెట్టుగూడ(మొదటి దశ) ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో వయాడక్ట్, ట్రాక్, ట్రాక్షన్ సిస్టం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మార్గంలో ఏడు మెట్రో రైళ్లకు ప్రతిరోజూ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎస్‌కు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మెట్రో పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు చైర్మన్ దియోస్థలి, ఎండీ గాడ్గిల్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, జలమండలి, రైల్వేశాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ..
సికింద్రాబాద్‌లోని తార్నాక మార్గంలో ఉన్న లేఖాభవన్, ఒలిఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లోని రైల్వే స్థలాలను మెట్రో స్టేషన్ నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించారు. ఆలుగడ్డబావి వద్ద రోడ్ అండర్‌బ్రిడ్జికి సైతం స్థలం కేటాయించాలని సూచించారు.
ఇమ్లీబన్(ఎంజీబీఎస్) వద్ద ఇంటర్ ఛేంజ్ మెట్రో స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని ఆర్టీసీ అధికారులు ఒప్పందం ప్రకారం తక్షణం అప్పగించాలని ఆదేశించారు. చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, గోపాలపురం పోలీస్‌స్టేషన్ భవనాలను పోలీసు శాఖ తక్షణం జీహెచ్‌ఎంసీకి అప్పజెప్పాలని ఆదేశించారు.
గడువులోగా మెట్రో పనులు: సీఎస్
Published Fri, Nov 21 2014 1:04 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement