ఆరోజు ఎప్పుడో!
*‘మెట్రో’ ప్రారంభ తేదీపై మల్లగుల్లాలు
*ఇటు సర్కారు.. అటు నిర్మాణ సంస్థ..
*పాతనగరం అలైన్‌మెంట్‌పై తేలని పేచీ
*ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద స్టీలు వారధికి తొలగిన అడ్డంకి
సాక్షి: నగరవాసుల కలల మెట్రో ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించే తేదీపై ఇటు సర్కారు.. అటు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఎటూ తేల్చడం లేదు. దీనిపై ఎవరి దారి వారిదే అన్న చందంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగోల్–మెట్టుగూడ, మియాపూర్, ఎస్‌ఆర్‌నగర్ మార్గాల్లో 20 కి.మీ మేర మెట్రో ప్రారంభానికి అవసరమైన సాంకేతిక పనులు పూర్తయ్యాయి. నాగోల్ మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భద్రతా ధృవీకరణ సైతం జారీ చేసింది. కానీ,రైళ్ల రాకపోకలను ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారన్న అంశం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఏడాది చివరినాటికైనా ప్రారంభమవుతుందా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది.
మొండికేస్తున్న నిర్మాణ సంస్థ..
మెట్రో నిర్మాణ ఒప్పందం (2011) కుదిరినప్పుడు నాగోల్ రహేజా ఐటీపార్క్, ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఫలక్‌నుమా కారిడార్లలో 72 కి.మీ పనులను.. 2017 జూన్ నాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ పేర్కొంది. కానీ ఆస్తుల సేకరణ, ప్రధాన రహదారులపై పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే సమస్యలు తలెత్తడం, అలైన్‌మెంట్ మార్పుపై అనిశ్చితితో ప్రాజెక్టు పూర్తిచేసే గడువును 2018 డిసెంబరుకు పొడిగించారు. గడువు పెరగడంతో తమపై సుమారు రూ. 2500 కోట్ల మేర తమపై ఆర్థిక భారం పెరిగిందని నిర్మాణ సంస్థ చెబుతోంది.
ఈ నిధులను ప్రభుత్వమే తమకు చెల్లించాలని, ఇతరత్రా రాయితీలు కల్పించాలని పట్టుబడుతూ నాగోల్–మెట్టుగూడ మార్గంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో మెలికి పెట్టినట్టు సమాచారం. ఈ విషయంలో సర్కారు జోక్యం చేసుకుంటేనే ఈ ఏడాది చివరినాటికైనా మెట్రో సర్వీసు అందుబాటులోకి వస్తుంది. మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో మెట్టుగూడ, ఆలుగడ్డ బావి, ఒలి ఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో ఇప్పటికే నెలకొన్న ద.మ రైల్వే పట్టాల పైనుంచి రైలు ఓవర్ బ్రిడ్జిలను వచ్చే ఏడాది జనవరి నాటికి వేస్తామని అధికారులు చెబుతున్నారు.
అలైన్‌మెంట్‌పై తేలని పేచీ..
జేబీఎస్,ఫలక్‌నుమా మార్గంలో ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గంలో పను లు జరుగుతున్నాయి. పాతనగరంలో ప్రార్థనా స్థలాలకు నష్టం కలగని రీతిలో మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చుతున్నట్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశంపై గడచిన శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగింది. దీంతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి పాతనగరం అలైన్‌మెంట్ ఖరారు చేస్తామని నిండు సభలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ మూడు నెలలుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోగా.. అలైన్‌మెంట్‌పై ఎటూ తేల్చలేదు. దీంతో ఎం జీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 3.5 కి.మీ మార్గంలో మెట్రో పనులు నిలిచిపోయాయి. దీనివల్ల పాతనగరానికి మరో రెండేళ్లు ఆల స్యంగా మెట్రో రైళ్లు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో పనులకు ఇప్పటికి 45 కి.మీ మేర పూర్తయినట్లు హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి.
ఇనుప వారధికి తొలగిన అడ్డంకి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ద.మ.రైల్వే పట్టాల పైనుంచి మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా నిర్మించ తలపెట్టిన భారీ ఇనుప వారధికి అడ్డంకులు తొలిగాయి. ఈ ప్రాంతంలో పనులు జరిగేందుకు వీలుగా ద.మ.రైల్వేకు చిలకలగూడ వద్ద ఉన్న ఒక ఎకరం స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు జీఎం రవీందర్ గుప్తా అంగీకరించినట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చోట్ల రైలు ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. తొలుత స్టీలు వారధిని పిల్లర్లపై నిలిపే గడ్డర్లను గోపాలపురం పోలీస్‌స్టేçÙన్ నుంచి తరలించాలని భావించారు. అయితే, పనుల్లో ఆలస్యం జరగకుండా చిలకలగూడ వైపు నుంచి గడ్డర్లను తరలిస్తున్నామన్నారు.
స్టీలు వారధి విశేషాలివీ..
*వారధి ఏర్పాటు చేసే ప్రదేశం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒలిఫెంటా బిడ్జి
*ఇనుప వారధి పొడవు 275 అడుగులు, బరువు 1100 టన్నులు
*రోడ్డు పైనుంచి వారధి ఎత్తు: 60 అడుగులు
*వారధి వంపు: 128 మీటర్లు రోడ్ కర్వ్
*నిర్మాణ విశిష్టత: ఈ స్టీలు వారధిని ఢిల్లీ సమీపంలోని గజియాబాద్‌లో తయారు చేశారు. హై స్ట్రెంత్ ఫ్రిక్షన్ గ్రిప్ దీని సొంతం
*వారధి నగరానికి చేరుకునేది: జూలై 2016
ఏర్పాటు చేసే విధానం: గజియాబాద్ నుంచి ముక్కలుగా నగరానికి తరలించి చిలకలగూడ వద్ద లాంచింగ్ గడ్డర్ల సహాయంతో పిల్లర్లపై ప్రీ కాస్టింగ్ విధానంలో ఏర్పాటు చేస్తారు.