ఆ దంపతులు రెండు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యకళకు జీవం పోస్తున్నారు. శ్రీ గీతిక నాట్య అకాడమీని స్థాపించి వందలాది మందికి తర్ఫీదునిస్తున్నారు. నాట్యమే ఆశగా, శ్వాసగా, ధ్యాసగా చేసుకుని ముందుకెళ్తున్నారు ఎర్రగడ్డ డివిజన్ కల్యాణ్‌నగర్ వెంచర్–3లో నివాసముంటున్న అనంత కృష్ణ, లక్ష్మీకృష్ణ దంపతులు. నగరంలోని రవీంద్రభారతిలో ఇటీవల కూచిపూడి అకాడమీ 20వ వార్షిక వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆ విశేషాలేమిటో ఒకసారి చూద్దాం. – శ్రీనగర్‌కాలనీ
ఏలూరుకు చెందిన లక్ష్మీకృష్ణ తన మూడో ఏట నుంచే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. నాట్యగురువులు కేవీ సత్యనారాయణ, పార్వతీ రామచంద్రన్, డాక్టర్ కె. నర్సింహారావుల వద్ద నాట్యాన్ని అభ్యసించారు. అనంతరం స్టేజీ ప్రదర్శనలతో ప్రతిభ కనబరిచేవారు. ప్రముఖ నాట్యమణులు, గురువులు మంజుభార్గవి, శోభానాయుడు, జయలలిత లాంటి వారితో నాట్య ప్రదర్శనలు చేశారు. దూరదర్శన్, సీనియర్ ఎన్టీఆర్ విశ్వామిత్రలోనూ ఆమె నాట్య ప్రదర్శన చేశారు. అనంతరం స్టేజీ ప్రదర్శనలు, మరోపక్క గురువుగా తన నాట్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇద్దరూ నాట్యగురువులే...
క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్సర్ అయిన అనంతకృష్ణను లక్ష్మీకృష్ణ ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం ఎన్ని కష్టాలొచ్చినా, అడ్డంకులు ఎదురైనా దంపతులిద్దరూ విద్యార్థులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. పండగల సందర్భాల్లో కూచిపూడి నృత్యాలు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలతో తెలుగు వెలుగులను పంచుతున్నారు. పలు సేవా కార్యక్రమాలు సైతం అకాడమీ ద్వారా నిర్వహిస్తున్నారు. వేసవిలో సమ్మర్ క్యాంపులతో కూచిపూడి నృత్యంలో చిన్నారులకు శిక్షణనిస్తున్నారు. సేవా దృక్పథంతో కళా సేవలో ఉండటమే తమ ధ్యేయమని నాట్యగురువు అనంతకృష్ణ వెల్లడించారు. లక్ష్మీకృష్ణ ఇప్పటివరకు నాట్య సరస్వతి, నాట్య విద్యాధరి, నాట్య మయూరీ పురస్కారాలు అందుకున్నారు.
కూచిపూడి నృత్యకళపై మక్కువతోనే..
విద్యార్థులకు కళల పట్ల మక్కువ పెంచుతూ భారతీయ కళలను నేర్పించాలన్నదే మా లక్ష్యం. భవిష్యత్తులో విదేశాలకు సైతం వెళ్లి అక్కడి ప్రవాస భారతీయులకు కళలను నేర్పించాలనుకుంటున్నాం. కూచిపూడి నృత్యకళ పట్ల మమకారంతో శ్రీ గీతిక కూచిపూడి అకాడమీని స్థాపించి వందలాది మందికి నృత్యంలో తర్ఫీదునిస్తున్నాం. – అనంతకృష్ణ, లక్ష్మీకృష్ణ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment