యువతకు ఉపాధే లక్ష్యం
తూప్రాన్: పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందువల్లే తమ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గురువారం ఆయన తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గల శాంతాబయోటెక్స్ కంపెనీ రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇన్సులిన్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి జిల్లాలో ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు.
ఇన్సులిన్ తయారీ కేంద్రం ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమ పూర్తిస్థాయిలో విస్తరణ జరిగితే మరో రెండువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇలాంటి పరిశ్రమలు నాలుగు ఏర్పడితే వజ్రాల తెలంగాణ నిర్మిస్తామన్నారు. సనోఫి కంపెనీ ప్రాంక్‌ఫర్ట్ తర్వాత రెండవ ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ముప్పిరెడ్డిపల్లిలో ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు.
మధుమేహరోగులకు అవసరైమన ఇన్సులిన్‌ను వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి తెచ్చేందుకు శాంత బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఇతర కంపెనీ ప్రతినిధులకు నడుంబిగించాలన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.850 ఉన్న ఇన్సులిన్‌ను వరప్రసాద్‌రెడ్డి రూ.150కే అందుబాటులోకి తేవడం వారి సేవా దృక్ఫథానికి నిదర్శనమన్నారు. శాంతాబయోటెక్స్ ఇన్సులిన్ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన సహాయం అందించాలని వేదికపై ఉన్న జిల్లా మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు సీఎం సూచించారు.
ఇన్సులిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు పూనుకున్న శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాంతా బయోటె క్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, మధుమేహ రోగులకు చౌకధరకు ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఇన్సుమన్ క్యాట్రిజ్ ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు లాభనష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సామాజిక సేవా దృక్పథంతో చౌకధరకు ఇన్సులిన్‌లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. తమ పరిశ్రమకు అవసరమైన చేయూత ఇవ్వాలని సీఎంను కోరారు. సనోఫి పరిశ్రమతో కలిసి మరో వెయ్యికోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
హెలీప్యాడ్ వద్ద సీఎంకు సాదర స్వాగతం
భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, సీఎం పేషీ ప్రత్యేకాధికారి స్మితాసభర్వాల్‌తో కలిసి హైదరాబాద్ నుంచి ెహ లీకాఫ్టర్‌లో ముప్పిరెడ్డిపల్లికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఉప సభాపతి పద్మదేవేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణరావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతిలు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
సీఎం పర్యటన సాగిందిలా...
హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో శాంతాబయెటెక్స్ పరిశ్రమకు 11.48కు చేరుకున్న సీఎం కేసీఆర్, అక్కడ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో సుమారు 20 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం పరిశ్రమలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం శాంతా బయోటెక్స్ ఇన్సులిన్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో సభను ప్రారంభించారు. ఆ తర్వాత 12.53 నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్... మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కొనసాగించారు.
అంతకుముందు పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు, డీప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి లు కూడా మొక్కలు నాటారు. అక్కడే భోజనం చేసిన సీఎం అనంతరం తన వాహనం వద్దకు వస్తున్న క్రమంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొందరు సీఎంతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
టీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
ముఖ్యమంత్రి భోజనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గుడారంలోకి టీఆర్‌ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అటుగా వచ్చిన టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ ఆయన్ను సముదాయించి లోనికి తీసుకువెళ్లారు. పరిశ్రమ వద్ద భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యకమంలో పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ శైలేష్, క్లార్డ్, సీఈఓ హరీష్, ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, ‘గడా’ అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, స్థానిక తహశీల్దార్ స్వామి, ఎంపీడీఓ కరుణాశీల, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, జెడ్పీటీసీ సుమన, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు సంజీవ్, మంజుల, శివ్వమ్మ, రఘునాథ్‌రావు, శ్రీశైలం యాదవ్, శేఖర్‌గౌడ్, శ్రీశైలం గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూనిర్వాసితుల ఆందోళన
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమలో ఉన్న సమయంలో కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, జీడీపల్లి, కూచారం గ్రామాలకు చెందిన సుమారు 20 మంది భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.