
సాక్షి, హైదరాబాద్ : ‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రజ్వల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖలో రాసిన ప్రజ్వల కళాశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సాయి ప్రజ్వల ఇంటి నుంచి కళాశాలకు అని చెప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment