Sai Prajwala
-
విద్యార్థిని ఆచూకీ లభ్యం
హైదరాబాద్: చదువుపై ఆసక్తి లేదని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన ఓ విద్యార్థిని ఆచూకీ లభించింది. మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం అడ్డగుంటపల్లికి చెందిన శ్రీనివాస్ కుమార్తె సాయిప్రజ్వల(17) హైదరాబాద్ శివారులోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల 10న సాయిప్రజ్వల కాలేజీలో ఉన్నప్పుడు నీరసంగా కనిపించింది. ప్రిన్సిపాల్ పిలిచి ‘ఎందుకు డల్‌గా ఉన్నావు’అని అడగగా నాకు చదువుకోవాలని లేదని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి శ్రీనివాస్ బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్ల వెంకటసాయి నగర్ కాలనీలో ఉండే సాయిప్రజ్వల మామ లక్ష్మీనారాయణకు తీసుకుని రమ్మని చెప్పారు. 10వ తేదీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయానే సాయిప్రజ్వల ఇంట్లో ఉత్తరం రాసి 11.30 గంటల నుంచి కనిపించకుండా పోయింది. పది రోజులుగా నాలుగు టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గోదావరిఖని, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్, ఇమ్లీబన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల్లో గాలించారు. చివరకు గురువారం రాత్రి పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని ఉప్పల్ డిపో వద్ద ఉన్న ఆరాధ్య లేడీస్ హాస్టల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఆచూకీ లభ్యమైంది ఇలా...: ప్రజ్వల కేసును పోలీసులు ఓ ఫోన్ కాల్ సమాచారం ద్వారా ఛేదించారు. మేడిపల్లి పోలీసులు 4 టీంలుగా ఏర్పడి నగరంతోపాటు తిరుపతి, గోదావరిఖని, ఖమ్మంలలో గాలించినా చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి అమ్మాయి స్నేహితులకు, బంధువుల ఫోన్స్ సీఆర్ డాటా పరిశీలించారు. ఆరాధ్య లేడీస్ హాస్టల్ నుంచి ఓ అమ్మాయి మొబైల్ తీసుకుని ఓ ఫోన్‌కు తరుచుగా కాల్ చేస్తోంది. పోలీసులు ఆ డేటా ఆధారంగా ఫోన్ లొకేషన్‌ను బట్టి ఉప్పల్ డిపో పరిసర ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టళ్లన్నింటినీ పరిశీలించారు. చివరికి ఆరాధ్య లేడీస్ హాస్టల్లో దొరికింది. -
సాయి ప్రజ్వల కోసం ముమ్మర గాలింపు
హైదరాబాద్: ఈ నెల 11న మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకట్సాయినగర్ కాలనీలో ఉంటున్న తన మామయ్య ఇంటి నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రజ్వల కోసం మేడిపల్లి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజ్వల జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి ప్రజ్వల.. బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బండ్లగూడలోని నారాయణ కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విచారించారు. ప్రజ్వల హాస్టల్ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక నోట్‌బుక్‌లో మూడు ఫోన్ నంబ ర్లను గుర్తించి ఫోన్ కాల్స్ చేయగా రెండు నంబర్లు ప్రజ్వల క్లాస్మేట్ రుతికకు సంబంధించినవిగా తెలిసింది. మరొకటి దోమలగూడకు చెందిన మహిపాల్‌రెడ్డి పేరు మీద ఉంది. ఆ ఫోన్‌ను ఆయన మేనల్లుడు వినయ్ వాడుతున్నాడు. అతను ఆరేళ్లుగా బెంగళూరులో చదువుకుంటు న్నట్లు తెలిసింది. వినయ్‌కు మేడిపల్లి పోలీసులు ఫోన్ చేయగా ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని కాల్ కట్ చేశాడు. సోమవారం ఒక బృందం ప్రజ్వల తండ్రి శ్రీనివాస్‌ను తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్టాండుల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మరో బృందం నారాయణ విద్యా సంస్థల హాస్టళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఇంకొక బృందం నాంపల్లి రైల్వేస్టేషన్, సీబీఎస్ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలు తిరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతి నుంచి ఓ వ్యక్తి మేడిపల్లి ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి టీవీలో కనపడకుండా పోయిందని చూపిస్తున్న అమ్మాయిని ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తుండగా చూశానని చెప్పాడు. దీంతో అక్కడకు ఓ బృందాన్ని పంపిస్తున్నారు. అయితే అది నమ్మశక్యంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రజ్వల సాయిబాబా భక్తురాలు కావడంతో షిర్డీకి వెళ్లి ఉంటుందని, అక్కడకు మరో బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిసింది. ప్రజ్వల వద్ద ఫోన్ లేకపోవడంతో ఒక్క క్లూ కూడా దొరకలేదని పోలీసులు అంటున్నారు. -
‘నారాయణ’ను మూసేయండి..
-
‘నారాయణ’ను మూసేయండంటూ లేఖ..
సాక్షి, హైదరాబాద్ : ‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రజ్వల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేక, వాళ్లు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేకే తాను వెళ్లి పోతున్నట్లు ప్రజ్వల లేఖలో పేర్కొంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేఖలో రాసిన ప్రజ్వల కళాశాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సాయి ప్రజ్వల ఇంటి నుంచి కళాశాలకు అని చెప్పి వెళ్తున్న సీసీటీవీ ఫుటేజిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.