
హైదరాబాద్: చదువుపై ఆసక్తి లేదని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన ఓ విద్యార్థిని ఆచూకీ లభించింది. మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలం అడ్డగుంటపల్లికి చెందిన శ్రీనివాస్ కుమార్తె సాయిప్రజ్వల(17) హైదరాబాద్ శివారులోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. ఈ నెల 10న సాయిప్రజ్వల కాలేజీలో ఉన్నప్పుడు నీరసంగా కనిపించింది. ప్రిన్సిపాల్ పిలిచి ‘ఎందుకు డల్‌గా ఉన్నావు’అని అడగగా నాకు చదువుకోవాలని లేదని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తండ్రి శ్రీనివాస్ బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని చెంగిచర్ల వెంకటసాయి నగర్ కాలనీలో ఉండే సాయిప్రజ్వల మామ లక్ష్మీనారాయణకు తీసుకుని రమ్మని చెప్పారు. 10వ తేదీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయానే సాయిప్రజ్వల ఇంట్లో ఉత్తరం రాసి 11.30 గంటల నుంచి కనిపించకుండా పోయింది. పది రోజులుగా నాలుగు టీంలుగా ఏర్పడి ముమ్మరంగా గోదావరిఖని, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్, ఇమ్లీబన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్‌ల్లో గాలించారు. చివరకు గురువారం రాత్రి పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని ఉప్పల్ డిపో వద్ద ఉన్న ఆరాధ్య లేడీస్ హాస్టల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.
ఆచూకీ లభ్యమైంది ఇలా...: ప్రజ్వల కేసును పోలీసులు ఓ ఫోన్ కాల్ సమాచారం ద్వారా ఛేదించారు. మేడిపల్లి పోలీసులు 4 టీంలుగా ఏర్పడి నగరంతోపాటు తిరుపతి, గోదావరిఖని, ఖమ్మంలలో గాలించినా చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి అమ్మాయి స్నేహితులకు, బంధువుల ఫోన్స్ సీఆర్ డాటా పరిశీలించారు. ఆరాధ్య లేడీస్ హాస్టల్ నుంచి ఓ అమ్మాయి మొబైల్ తీసుకుని ఓ ఫోన్‌కు తరుచుగా కాల్ చేస్తోంది. పోలీసులు ఆ డేటా ఆధారంగా ఫోన్ లొకేషన్‌ను బట్టి ఉప్పల్ డిపో పరిసర ప్రాంతంలో ఉన్న లేడీస్ హాస్టళ్లన్నింటినీ పరిశీలించారు. చివరికి ఆరాధ్య లేడీస్ హాస్టల్‌లో దొరికింది.
Comments
Please login to add a commentAdd a comment