
హైదరాబాద్: ఈ నెల 11న మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకట్‌సాయినగర్ కాలనీలో ఉంటున్న తన మామయ్య ఇంటి నుంచి కనిపించకుండా పోయిన సాయి ప్రజ్వల కోసం మేడిపల్లి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజ్వల జాడ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి ప్రజ్వల.. బైపీసీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న బండ్లగూడలోని నారాయణ కాలేజీ హాస్టల్‌కు వెళ్లారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను విచారించారు. ప్రజ్వల హాస్టల్ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక నోట్‌బుక్‌లో మూడు ఫోన్ నంబ ర్లను గుర్తించి ఫోన్ కాల్స్ చేయగా రెండు నంబర్లు ప్రజ్వల క్లాస్‌మేట్ రుతికకు సంబంధించినవిగా తెలిసింది. మరొకటి దోమలగూడకు చెందిన మహిపాల్‌రెడ్డి పేరు మీద ఉంది.
ఆ ఫోన్‌ను ఆయన మేనల్లుడు వినయ్ వాడుతున్నాడు. అతను ఆరేళ్లుగా బెంగళూరులో చదువుకుంటు న్నట్లు తెలిసింది. వినయ్‌కు మేడిపల్లి పోలీసులు ఫోన్ చేయగా ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదని కాల్ కట్ చేశాడు. సోమవారం ఒక బృందం ప్రజ్వల తండ్రి శ్రీనివాస్‌ను తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్ బస్టాండుల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మరో బృందం నారాయణ విద్యా సంస్థల హాస్టళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. ఇంకొక బృందం నాంపల్లి రైల్వేస్టేషన్, సీబీఎస్ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలు తిరిగింది. సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతి నుంచి ఓ వ్యక్తి మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి టీవీలో కనపడకుండా పోయిందని చూపిస్తున్న అమ్మాయిని ఓ హోటల్ వద్ద టిఫిన్ చేస్తుండగా చూశానని చెప్పాడు. దీంతో అక్కడకు ఓ బృందాన్ని పంపిస్తున్నారు. అయితే అది నమ్మశక్యంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. ప్రజ్వల సాయిబాబా భక్తురాలు కావడంతో షిర్డీకి వెళ్లి ఉంటుందని, అక్కడకు మరో బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిసింది. ప్రజ్వల వద్ద ఫోన్ లేకపోవడంతో ఒక్క క్లూ కూడా దొరకలేదని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment