సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ అంశాన్ని లోక్‌సభ ఎన్నికల బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీసహా ఇతర నేతల పర్యటనల్లో ఎండగట్టేలా వ్యూహాలు ఉండాలనే నిర్ణయించింది. శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి హాజరయ్యారు. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ భేటీకి హాజరుకాలేదు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపైనే ప్రధానంగా చర్చించారు.
పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా దీనికి అడ్డుకట్ట పడలేదని, కొత్తగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ను పార్టీలో చేర్చుకున్నారని నేతలు ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్త ఉద్యమం అవసరముందని, లోక్‌పాల్‌కు కూడా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఈ నెల ఒకటిన జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో జరిగే రాహుల్‌గాంధీ సభల్లో ఫిరాయింపుల అంశాన్ని ప్రధానంగా ప్రజలకు వివరించాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని, ఎన్నికలు జరిగిన మూడు రోజుల నుంచే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ధోరణి సరిగా లేదని, దీనిపై న్యాయపోరాటం చేయాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
అనర్హత వేటు వేయండి..
కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రకటించిన పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సీఎల్పీ బృందం శాసనసభ సభ కార్యదర్శి నరసింహాచార్యులును కలసి కోరింది. పార్టీ ఫిరాయిస్తున్న పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఆయనకు అందజేసింది. దీనిపై స్పీకర్‌కే నేరుగా వినతిపత్రాన్ని ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించినట్లుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment