జిల్లాల వివాదంపై సీఎం ఆరా
కలెక్టర్లతో సమావేశాలు.. 8 జిల్లాల ఏర్పాటు లాంఛనమే
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ప్రధానంగా మూడు జిల్లాల్లో చిచ్చు పెట్టింది. వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రాంతాల వారీగా భిన్నాభిప్రాయాలు నెలకొనటంతో వివాదం ముదురుతోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో వివాదాస్పదంగా మారిన కేంద్రాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించటంతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, జనగాం.. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, వనపర్తి.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాలపై వెల్లువెత్తిన ఆందోళనలు, అభ్యంతరాలపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై ప్రత్యేక నివేదికను అందించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు, సీఎస్‌కు సీఎం సూచించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో మహబూబాబాద్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలనే ఆందోళన తీవ్రమవుతుండటంతో పరిస్థితిని అంచనా వేసేం దుకు సీఎం శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను పిలిపించి సమీక్ష జరిపారు.
మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డి.కె.అరుణ పట్టుబడుతున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన ప్రక్రియపైనా ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. విపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు తయారు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
ఎనిమిది జిల్లాలపై స్పష్టత: వివాదాస్పద కేంద్రాలను మినహాయిస్తే ఎనిమిది కొత్త జిల్లాల ప్రతిపాదనలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. వాటికి సంబంధించిన సరిహద్దులు, మ్యాపులు తయారవుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, మెదక్‌లో సిద్దిపేట, నల్లగొండలో సూర్యాపేట, వరంగల్‌లో భూపాలపల్లి, ఖమ్మంలో కొత్తగూడెం, కరీంనగర్‌లో జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖాయమైంది. వీటిని ప్రకటించటం లాంఛనమేనని, ఏయే ప్రాంతాలను వీటిలో కలపాలనే అంశంపైనే తుది కసరత్తు జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలను జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి అందాయి.