శ్రీరామనవమికి ముఖ్యమంత్రి జిల్లాకు రాక
ఖమ్మం వైరారోడ్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమికి జిల్లాకు రానున్నారని పార్లమెంట్ కార్యదర్శి జలగం వెంకట్రావ్ తెలిపారు. ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి రాక ఖరారు కకపోయినా ఒకరోజు ముందుగాని, లేని పక్షంలో శ్రీరామనవమికి రావటం మాత్రం ఖాయమని ఆయన అన్నారు. శనివారం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా...
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని, ముఖ్యంగా మణుగూరులో ఏర్పాటు చేయనున్న విదుత్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని అన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్న తీరును సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి ఎకరం సాగులోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రెండు, మూడు ఏళ్లలో అది సాధ్యమని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని చెరువులు పునరుద్ధరణ జరుగుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర సుభిక్షంగా ఉండడం ఖాయమని స్పష్టం చేశారు.
అలాగే ఖమ్మం కార్పొరేషన్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అందుకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలనే దానిపై అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వేసవికాలంలో జిల్లాలో నీటి ఎద్దడిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకుం టున్నామన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్ర అవసరాల కోసం కావాల్సిన విద్యుత్ సరఫరా కోసం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు నాలుగులైన్ల రోడ్డు మంజూ రైందరని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ, ఎయిర్‌పోర్ట్ తీసుకువచ్చేందుకు తనవంతు కృషిచేస్తానన్నారు.