గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముచ్చటిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు (ఎట్ హోం) సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఎట్‌హోం కార్య క్రమంలో గవర్నర్ దంపతులు నరసింహన్, విమలా నరసింహన్ అతిథుల వద్దకు వెళ్లి పేరుపేరునా స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా.. సీఎం కేసీఆర్‌తోపాటు గవర్నర్ దంపతులు ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్యతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలను పలకరించిన సీఎం కేసీఆర్.. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ కంపెనీ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డితో సుదీర్ఘంగా సంభాషించారు. అతిథులను పలకరించిన అనంతరం.. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ 25నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఇద్దరి నడుమ ఆసక్తికర చర్చ సాగిందని చెబుతున్నా.. భేటీ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు.
కేసీఆర్‌తో జానారెడ్డి కరచాలనం, పక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కలిసే సందర్భం రావట్లేదు!
ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను గవర్నర్, సీఎం కేసీఆర్ పలకరించారు. ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం, నేతల నడుమ పలుసార్లు ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని ఎలా ఉన్నారంటూ సీఎం కేసీఆర్ పలకరించగా.. ఇప్పుడు మనం కలిసే సందర్భం రావడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీలో అప్పుడో, ఇప్పుడో కలిసే సందర్భం వచ్చేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండని గవర్నర్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని గవర్నర్ అన్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య కూడా సుమారు 2 నిమిషాల పాటు ఆసక్తికర సంభాషణ కొనసాగింది.
తరలివచ్చిన ప్రముఖులు
కార్యక్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు నేతలతో పాటు, ప్రభుత్వాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్, సంతోష్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, క్రీడాకారులు మిథాలీరాజ్, పుల్లెల గోపీచంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment