సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు రూ.99,999 లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సదరు రైతుల రుణాలున్న బ్యాంకుల్లో తక్షణమే సొమ్ము జమ చేయాలని సీఎం కేసీఆర్ సోమవారం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం రూ.5,809.78 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్థిక ఇబ్బందులతో జాప్యమైనా..
2018 ఎన్నికల సమయంలో రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే విడతల వారీగా రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే దీని అమల్లో జాప్యం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్లతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమవుతోందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు చెప్పారు.
45 రోజుల కార్యాచరణతో
ఆగస్టు 2న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేసి.. 45 రోజుల కార్యాచరణ రూపొందించారు. సెపె్టంబర్ 15వ తేదీ నాటికి మొత్తం రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇంతకు ముందే తొలి విడతగా 5,42,609 మంది రైతులకు సంబంధించి రూ.1,207.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రెండో విడతగా.. ఆగస్టు 3, 4, 11 తేదీల్లో కలిపి 1,76,878 మంది రైతులకు సంబంధించి రూ. 736.27 కోట్లను బ్యాంకుల్లో జమ చేసింది. తాజాగా 9,02,843 మంది రైతులకు సంబంధించి రూ.99,999 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 16,66,899 మంది రైతుల రుణాలకు సంబంధించి రూ.7,753.43 కోట్లను విడుదల చేశారు.
రాష్ట్రంలో రైతు రాజ్యం
తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రుణమాఫీతో మరోసారి రుజువైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2014లోనూ రైతుల రుణమాఫీ చేశామని, 35,32,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగునీటి వసతుల కల్పనలో భాగంగా.. మిషన్ కాకతీయ కింద 35వేల చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని వివరించారు.
సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించి జైళ్లకు పంపడం, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటివాటితో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం, ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాలతో సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్‌తో..
దుఃఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తోందని, రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మరణించిన రైతులకు రూ.5,402.55 కోట్లు పరిహారంగా అందినట్టు వివరించారు.
ఇక రాష్ట్రంలో 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ పంటల సాగుకు అండగా నిలిచామని.. గత తొమ్మిదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.96,288 కోట్లను భరించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’తో ప్రత్యక్ష ప్రయోజనం కలుగత్తోందని.. ఎకరానికి ఏటా రూ.10వేల చొప్పున.. ఇప్పటివరకు 11 విడతల్లో రూ.71,552 కోట్లను రైతులకు అందించామని తెలిపారు.
రూ.99,999 వరకు రుణమాఫీ క్లియర్
Published Tue, Aug 15 2023 12:56 AM | Last Updated on Tue, Aug 15 2023 12:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment