7 జోన్లు.. 2 మల్టీ జోన్లు | CM KCR Decided To Set Seven Zones And Two Multi Zones  in State | Sakshi
Sakshi News home page

7 జోన్లు.. 2 మల్టీ జోన్లు

Published Fri, May 25 2018 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

CM KCR Decided To Set Seven Zones And Two Multi Zones  in State - Sakshi

సీఎం చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, వికారాబాద్‌ జోన్లను ప్రతిపాదించింది. 

ప్రస్తుతమున్న మల్టీ జోన్లను రద్దు చేయాలని సిఫారసు చేసింది. కమిటీ సిద్ధం చేసిన ముసాయిదా ప్రతులను ప్రభుత్వం వారం రోజుల కిందట ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అందించింది. ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రగతిభవన్‌లో  సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ముసాయిదాకు భిన్నంగా జోన్లు, మల్టీ జోన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో మొత్తం ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు పచ్చజెండా ఊపారు. ఒక్కో జోన్‌లో నాలుగైదు కొత్త జిల్లాలుండేలా పునర్వ్యవస్థీకరించారు. 

ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు అజయ్‌ మిశ్రా, నర్సింగ్‌రావు, శివశంకర్, అధర్‌ సిన్హా, భూపాల్‌ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీ ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు సమావేశంలో పాల్గొన్నారు. 

జోన్లకు పుణ్యక్షేత్రాల పేర్లు 
కొత్తగా నిర్ణయించిన 7 జోన్లలో చార్మినార్‌ మినహా అన్నింటికీ పుణ్యక్షేత్రాల పేర్లను ఖరారు చేశారు. మొదటి జోన్‌కు కాళేశ్వరం, రెండో జోన్‌కు బాసర, మూడో జోన్‌కు రాజన్న, నాలుగో జోన్‌కు భద్రాద్రి, అయిదో జోన్‌కు యాదాద్రి, ఆరో జోన్‌కు చార్మినార్, ఏడో జోన్‌కు జోగుళాంబ అని పేరు పెట్టారు. ఒకటో మల్టీ జోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లను నిర్ణయించారు. రెండో మల్టీ జోన్‌లో యాదాద్రి, జోగుళాంబ, చార్మినార్‌లకు చోటిచ్చారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ ఒకటో మల్టీ జోన్‌లో, దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ రెండో మల్టీ జోన్‌లో  చేరినట్లయింది.  రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలియజేయడంతోపాటు ఇతర అంశాలు చర్చించేందుకు శుక్రవారం టీజీవో భవన్‌లో సమావేశం జరగనుంది. 

ఉద్యోగుల సమావేశం తర్వాత వారిఅభిప్రాయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్‌ పంపుతారు. దీనిపై కేబినెట్‌ సమావేశం జరుగుతుంది. జోనల్, మల్టీ జోనల్‌ వ్యవస్థకు కేబినెట్‌ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదానికి నివేదిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, రాష్ట్రంలో కొత్త జోనల్, మల్టీ జోనల్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సీఎం చెప్పారు.  

మల్టీ జోనల్‌ అంటే..?
జోనల్‌ స్థాయి, రాష్ట్ర కేడర్‌కు మధ్యలో ఉండే పోస్టులను మల్టీ జోనల్‌ పోస్టులుగా పరిగణిస్తారు. మల్టీ జోనల్‌ విధానం ఉమ్మడి రాష్ట్రంలోనూ అమల్లో ఉండేది. అప్పుడు కూడా ఆరు జోన్లతో పాటు రెండు మల్టీ జోన్లున్నాయి. తెలంగాణలోని 5, 6 జోన్‌లు, 4వ జోన్‌లోని రాయలసీమ కలిపి ఒక మల్టీజోన్, ఏపీలోని మిగతా మూడు జోన్లు కలిపి మరో మల్టీ జోన్‌గా ఉండేవి. జోనల్, మల్టీ జోనల్‌ పోస్టుల వర్గీకరణ ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉంది. ఉదాహరణకు పంచాయతీరాజ్‌ శాఖలో ఎంపీడీవో పోస్టులు మల్టీ జోనల్‌ పరిధిలో ఉన్నాయి. డీఎల్‌పీవోలు జోనల్‌ పోస్టులుగా, ఆపై స్థాయిలో ఉండే డీపీవో పోస్టులు రాష్ట్ర కేడర్‌గా పరిగణిస్తున్నారు. 

ఇదే క్రమంలో సీడీపీవోలు, కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్, పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాళ్లు, డిప్యూటీ ఈవోలు, డ్రగ్స్‌ మైనింగ్‌ విభాగాల్లోని కొన్ని పోస్టులు మల్టీ జోనల్‌ కేడర్‌లో ఉన్నాయి. రాష్ట్ర కేడర్‌ పోస్టులు నేరుగా భర్తీ చేస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పోటీ పడే అవకాశముంటుంది. అందుకే స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉండేదుకు వీలుగా మల్టీ జోన్లను కొనసాగించాలని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం మల్టీ జోనల్‌ వ్యవస్థను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. శాఖల వారీగా పోస్టులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర కేడర్‌గా వర్గీకరిస్తేనే ఈ విధానంతో ప్రయోజనం ఉంటుందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement