సాక్షి, హైదరాబాద్: భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాల్లో జరిగిన దాడులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఖండించారు. దళితుల అభిప్రాయాలు, మనోవేదనను న్యాయస్థానాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని సీఎం కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరఫున న్యాయస్థానానికి చెప్పాలని కోరారు.
తమ హక్కులు, చట్టాలకు భంగం కలుగుతుందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని చెప్పారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం, సమాజం అండగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అణచివేతకు గు రైన దళితులకు అండగా ఉండేందుకే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని, కేంద్రం కూడా అనేక సం దర్భాలలో దళితులకు రక్షణగా ఉండేందుకు ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. దళితులకు కల్పిం చిన హక్కులు, తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నా రు. సుప్రీంకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసేలా, తమ రక్షణ కోసం ఉన్న చట్టాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.
తప్పుడు వార్తలు రాస్తే చట్టాలు చూసుకుంటాయి
తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల అక్రెడిటేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తప్పుబట్టారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార, తప్పుడు వార్తలు ప్రచురించిన/ప్రసారం చేసిన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తుచేశారు. తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేస్తామనడం దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఆందోళన కలిగించే అంశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment