సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్స్ విషయంలో తర్జనభర్జ పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతులు ఇచ్చింది. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో రెండు నెలల తర్వాత టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి నెలకొననుంది. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం థియేటర్లను ప్రారభించడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. (కేసీఆర్‌తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ)
ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరవలేం
కాగా సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, అందుకవసరమయ్యే విధి విధానాలు రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ రెండు నెలలకు పైగా ఆగిపోయిన షూటింగ్స్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేమన్నారు. (దూ..రం.. అ..యి..తే.. నష్టమే!)
Comments
Please login to add a commentAdd a comment