కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం | CM KCR Hold Cabinet Meeting At Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15 వేల కోట్ల రుణం

Published Thu, Dec 12 2019 1:50 AM | Last Updated on Thu, Dec 12 2019 10:13 AM

CM KCR Hold Cabinet Meeting At Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కొత్తగా మరో రూ.15,575.11 కోట్ల రుణాలు సమీకరించాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం నీటిపారుదల పథకం కార్పొరేషన్‌ పేరుతో నాబార్డు నుంచి రూ.1,500 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నుంచి రూ.10 వేల కోట్లు, పీఎఫ్‌సీ నుంచే మరో రూ.4,075.11 కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9.30 గంటల పాటు కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 

గోదావరిపై దుమ్ముగూడెం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 3,481.9 కోట్ల అంచనా వ్యయంతో దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఈ బ్యారేజీకి అనుబంధంగా 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీకి అయ్యే ఖర్చును రెండేళ్ల పాటు బడ్జెట్లలో కేటాయించాలని నిర్ణయించింది. దుమ్ముగూడెం వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉండే ఐదారు నెలల పాటు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజీ నిర్మాణం చేపట్టొచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నందున రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసుకోవచ్చని అధికారులు ప్రతిపాదించారు. మిడ్‌మానేరు వరకు 3వ టీఎంసీని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను రెండేళ్ల పాటు బడ్జెట్‌లో కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.1 టీఎంసీని తరలించనున్నారు. 

లోకాయుక్తకు సవరణలు..
లోకాయుక్త చైర్మన్, వైస్‌ చైర్మన్ల నియామకానికి సంబంధించిన అర్హతలను మార్చేందుకు తెలంగాణ లోకాయుక్త చట్టాన్ని అత్యవసరంగా సవరిస్తూ ఆర్డినెన్స్‌ తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. లోకాయుక్త చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీని నియమించాలన్న నిబంధన స్థానంలో జిల్లా జడ్జిగా పనిచేసి రిటైరైన వారికి కూడా అవకాశం కల్పించేలా సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పల్లె ప్రగతిలో విఫలమయ్యారు.. 
అధికారులపై సీఎం ఆగ్రహం 
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమమైన ‘పల్లె ప్రగతి’పురోగతిపై సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన ఈ కార్యక్రమం స్ఫూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శిని సీఎం ప్రశ్నించారు. ఎలాంటి అలసత్వం లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. గతంలో 30 రోజుల కార్యక్రమం నిర్వహించినట్లుగా వచ్చే నెలలో 10 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.  

ఖర్చులు తగ్గిద్దాం..
కేబినెట్‌ భేటీలో ఆర్థిక స్థితిపై సీఎం కేసీఆర్‌ సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో శాఖల వారీగా ఖర్చులు తగ్గించుకో వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి పెంచాలని నిర్ణయానికి వచ్చింది. బుధవారం ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ లోతుగా చర్చించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ముఖ్య అధికారులతో జరిపిన భేటీలో చర్చించిన ఆర్థిక అంశాలను మరోసారి ఈ భేటీలో సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.1.84 లక్షల కోట్లతో తొలుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి, ఆ తర్వాత రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రూ.1.46 లక్షల కోట్లకు కుదించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. కేంద్ర పన్నుల వాటాతో పాటు ఇతరత్రా ఆదాయం తగ్గడం.. ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 4 నెలల్లో ముగియనుండటంతో అత్యవసర పనులకు మినహా, ఇతరత్రా కేటాయింపులు చేయొద్దని సీఎం అధికారులకు సూచించారు. ఆర్థిక పరిస్థితి అనిశ్చిత స్థితిలో ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలకు నిధులు తగ్గించడంతో పాటు, శాఖల పరిధిలో ఖర్చు విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

కేంద్ర వాటాలో కోతతో ఇబ్బందులు
‘కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.19,719 కోట్లు రావాలి. గడిచిన 8 నెలల కాలంలో కేంద్రం నుంచి పన్నుల వాటా ద్వారా రూ.10,304 కోట్లు మాత్రమే వచ్చా యి. గత ఏడాది ఇదే సమయానికి అందిన పన్నుల వాటాతో పోలిస్తే మనకు రూ.224 కోట్లు తక్కువగా వచ్చాయి. రాష్ట్రానికి రావాల్సిన  నిధులు ఇవ్వాలని మనం కేంద్రాన్ని కోరినా స్పందన కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రం వాటాలో 15 శాతం మేర కోత పడే సూచనలు కనిపిస్తున్నా యి. అదే జరిగితే రాష్ట్ర వాటాలో రూ.2,954 కోట్లు తగ్గుతాయి’ అని సీఎం వివరించారు.

కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్దాం..
‘కేంద్రం వైఖరి చూస్తే పన్నుల వాటాలో రాబోయే రోజుల్లో మరింత కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి చేద్దాం. కేంద్రం నుంచి జీఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,719కోట్ల బకాయిల తో పాటు, ఐజీఎస్టీతో తెలంగాణకు రూ.2,812 కోట్లు రావాల్సి ఉందని’ సీఎం వెల్లడించినట్లు సమాచారం. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్ర పథకాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున కేంద్ర వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలి సింది. దిశ హత్యాచారం, తదనంతర ఘటనలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement