మహబూబాబాద్ మెడికల్ కాలేజీ భవనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్యవిద్యా రంగ చరిత్రలో మంగళవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఆన్‌లైన్‌లో ఒకేసారి 8 కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన సందర్భమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో ఉస్మానియా (1946), గాంధీ(1954) దవాఖానాలు ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఆవిర్భవించే నాటికే ఉన్నాయి.
గత ప్రభుత్వాలు 57 ఏళ్లలో కాకతీయ(1959), ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశాయి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు రోగులకు అందనున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటిల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను కలుపుకొని మొత్తం 35 వైద్య విభాగాలు సేవలందించనున్నాయి.
449 మంది డాక్టర్లు, 600 మందికిపైగా పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. పెద్ద వ్యాధి వచ్చినా రోగులు హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా సమీపంలోనే నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గత ఎనిమిదేళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. పెద్దమొత్తం ఖర్చుతో వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించే పరిస్థితులు తప్పనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment