
'కేసీఆర్ సీఎం కావడమే తెలంగాణకు దోషం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాస్తు దోషం లేదని.. కేసీఆర్ సీఎం అవ్వడమే పెద్ద దోషమని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నిజాం వారసునిగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం టీటీడీపీ నేతలంతా హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని సందర్శించారు. సచివాలయానికి వాస్తు దోషం ఉందంటూ చెస్ట్ ఆస్పత్రిని తరలించటం సబబు కాదని వారు మండిపడ్డారు.
ఈ ఆస్పత్రిని ఎర్రగడ్డలోనే ఉంచాలని లేదంటే ఉద్యమానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి ప్రకపంపనలు సృష్టిస్తున్నారని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆస్పత్రి తరలించటానికి ఒప్పుకునేది లేదని టీటీడీపీ నేత ఎల్. రమణ అన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోజూ 50 వేల మందికి పైగా రోగులు వస్తారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.