సాక్షి, మెదక్ : తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమేనని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు అందించామన్నారు. గురువారం ఆయన ఆరో విడత హరితహారాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటారు. అనంతరం 15 కోట్లుతో నిర్మించిన అర్బన్ పార్కును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పచ్చదనం పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, అభివృద్ధి పనులకు డబ్బుల కొరతే లేదన్నారు.
‘లాక్‌డౌన్ వల్ల ఉద్యోగులకు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు. కానీ ఇప్పడు ఆర్థిక పరిస్థితి బాగుంది. తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమే ఇందులో డౌటే లేదు. ఇది అధికారికంగా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కావాలంటే మీకు పాలనరాదు అన్నారు. కానీ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చెప్పింది. మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కానీ వచ్చాయి. రాష్ట్రంలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఉండేది కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాలేళ్వరం నీళ్లు వస్తాయి. ఇలా అన్ని సమస్యలను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్ హెచ్చరిక
కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కలప దొంగతనం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై కలప స్మగ్లర్లను దేశంలో ఎవడూ కాపాడలేడన్నారు. చీమ చిటుక్కుమన్నా తనకు సమాచారం వస్తుందని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment