
శనివారం ప్రగతి భవన్‌లో ‘కాళేశ్వరం’పై సమీక్షలో హరీశ్‌తో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించడంతో పాటు పూర్వపు ఏడు జిల్లాల అవసరాలు తీర్చగలిగే ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఇంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టు కాబట్టి అధికారులు, కాంట్రాక్టర్లు మనసు పెట్టి పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు వంటి అవాంతరాలన్నీ తొలగిపోయాయని.. ఇకపై పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట ఒప్పందాలు పూర్తయ్యాయని, అటవీ అనుమతులు వచ్చాయని, పర్యావరణ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయని చెప్పారు.
శనివారం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సుదీర్ఘంగా ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి గంధమల్ల, బస్వాపూర్ వరకు చేపడుతున్న అన్ని పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వేగంగా, తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కృషి చేసిన అధికారులను అభినందించారు.
విద్యుత్ శాఖకు కృతజ్ఞతలు
‘‘తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అద్భుతంగా మెరుగుపరిచాం. జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించనున్నాం. రాష్ట్రంలో ఇకపై ప్రతి రంగానికి 24 గంటలూ నాణ్యమైన కరెంట్ అందిస్తాం. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం. ఇప్పటికే 3 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతోంది. మరో నెలన్నరలో ఇంకో 500 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. ఇక ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ ఇవ్వడానికి విద్యుత్ శాఖ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అనుకున్నదాని కంటే నెల ముందే విద్యుత్ శాఖ పని పూర్తిచేస్తోంది. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బంది బాగా పనిచేసి రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. విద్యుత్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నా..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల పంపుహౌజ్‌లు, ఇతర పనులకు విద్యుత్ సరఫరా ఏర్పాట్లను ప్రభాకర్‌రావు, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
హరీశ్‌పై కోటి ఆశలు
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని, తమకు నీళ్లు అందిస్తారని మంత్రి హరీశ్‌పై, నీటి పారుదల శాఖ అధికారులపై ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఉన్నారు. మంత్రి, అధికారులు ఇందుకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మంత్రి బాగా పనిచేశారు. సీఈ వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పనిచేయాలి. ఇకపై మంత్రి హరీశ్‌రావు ప్రతి 10 రోజులకోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలి. నెలకోసారి నేను, సీఎస్ కూడా కాళేశ్వరం పనులు చూస్తాం. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీరు తీసుకుపోవడం చాలా ముఖ్యం. ఈ పనులు చేయడానికి 200 రోజుల సమయం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి..’’అని కేసీఆర్ సూచించారు.
మిడ్ మానేరు సిద్ధం..
మిడ్‌మానేరు డ్యాం నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఇప్పటికే 10 గేట్లు బిగించామని.. కట్టపై రోడ్డు కూడా నిర్మిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో జనవరి నెలాఖరు కల్లా పనులు మొత్తం పూర్తికావాలని, 25 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి వరకు 80 వేల ఎకరాలకు నీరివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి దాకా 4,200 క్యూసెక్కుల ప్రవాహ ఉధృతికి తగ్గట్లు కాలువ, టన్నెల్ నిర్మించామని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు నిర్మించాల్సి ఉందని అధికారులు వివరించారు. దీంతో ఈ కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం వెంటనే రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని.. ఆ లోపుగా చేరే నీటిని వాడుకునేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్కన్‌పేట రిజర్వాయర్ వరకు వెళ్లే టన్నెల్ నిర్మాణ పనులను, రిజర్వాయర్ పనులను సీఎం సమీక్షించారు. హుస్నాబాద్, సిరిసిల్ల తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలని.. మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి, మల్కన్‌పేటలకు త్వరగా నీళ్లివ్వడం వల్ల అక్కడి రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. ఇక దేవాదుల ఎత్తిపోతల పథకం కోసం అవసరమయ్యే నీటిని అందించడానికి కొత్తూరు వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర రిజర్వాయర్లపైనా సమీక్షించారు. సమీక్షలో మంత్రులు హరీశ్, ఈటల, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
నెలన్నరలో మిషన్ భగీరథ నీళ్లు
మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో నెలన్నరలో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలకు నీళ్లు అందుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ద్వారా మిషన్ భగీరథకు అవసరమైన నీరు అందించాలని అధికారులకు సూచించారు. కాగా.. పంపుహౌజ్‌లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లలో కూడిన ప్యానెల్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. అందులో నీటి పారుదల శాఖకు చెందిన 16 మంది విద్యుత్ శాఖకు చెందిన 10 మంది ఇంజనీర్లు ఉంటారు.
సమీక్షలో సీఎం నిర్ణయాలివీ..
⇒ అటవీ శాఖ అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులు కృషి చేయాలని. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేయడానికి, విద్యుత్ టవర్లు, లైన్లు నిర్మించడానికి అటవీ శాఖ సహకరించాలి.
⇒ కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్‌మానేరుకు నీరు అందితేనే మంచినీటి పథకం అమలు చేయగలం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలి.
⇒ ప్రతి బ్యారేజీపై డబుల్ లైన్ రోడ్డు నిర్మించాలి. విద్యుత్ సబ్‌స్టేషన్లు, కాల్వలు, పంపుహౌజ్‌లకు శాశ్వత ప్రాతిపదికన రహదారులు నిర్మించాలి.
⇒ ప్రతి పంపుహౌజ్ వద్ద ఒక విద్యుత్ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించాలి. నీటిపారుదల శాఖతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి.
⇒ ప్రతి బ్యారేజీ వద్ద మంచి అతిథి గృహం నిర్మించాలి.
⇒ బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్లు తదితర పనులన్నీ సమాంతరంగా జరగాలి.
⇒ బ్యారేజీల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేయాలి. నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాజెక్టు వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
⇒ ప్రతి బ్యారేజీ వద్ద శాశ్వత ప్రాతిపదికపై హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయాలి.
⇒ మేడిగడ్డ వద్ద 365 రోజులు నీరు అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి ఎత్తిపోతల పనులు ఏ మేరకు పూర్తయితే ఆ మేరకు నీటిని తరలించవచ్చు. ఈ మేరకు చర్యలు చేపట్టాలి.
⇒ ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం 400 కేవీ విద్యుత్ లైన్లను సిద్ధం చేశాం. అంతరాయం కలగకుండా సరఫరా చేయాలి.
రాష్ట్ర చట్టం ప్రకారమే భూసేకరణ
చట్టం ప్రకారమే భూసేకరణ చేయాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారమే చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2013 కేంద్ర చట్టంకన్నా 2017 రాష్ట్ర చట్టం వల్ల ఎక్కువ మేలు కలుగుతుందని చెప్పారు. నిర్వాసితుల భవనాలు, షెడ్డులకు ధర నిర్ణయించినట్లే బోర్లకు కూడా ధర నిర్ణయించాలన్నారు.
శనివారం ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్షలో అధికారులు
Comments
Please login to add a commentAdd a comment