అప్రమత్తంగా ఉండండి
• అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
• భారీ వర్షాలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం ఉదయం రాష్ట్రంలో వర్షాల తీవ్రత, పరిణామాలపై సమీక్షించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు అన్ని చెరువులు, కుంట ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ... ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని.. ప్రజలకవసరమైన సహాయం అందించడంతో పాటు తగిన సూచనలు చేయాలని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలను తరలించాలని... అవసరమైతే ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం, పోలీస్, ఆర్మీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. అంటురోగాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.