స్కామేమీ లేదు
► సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: కేసీఆర్
►రాజధాని భూముల వ్యవహారంపై సీఎం స్పష్టీకరణ
►గజం కూడా అన్యాక్రాంతం కాలేదు.. ఉన్నతాధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా రాజధాని భూముల వ్యవహారంలో కుంభకోణమేమీ జరగలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇందులో ఖజానాకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదన్నారు. రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడ్డ వారిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశామని, సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన గజం స్థలం కూడా అన్యాక్రాంతం కాలేదని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల బాగోతాలపై వరుసగా వెలుగుజూసిన సంఘటనలపై సీఎం మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డీజీపీ అనురాగ్ శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ నదీమ్ అహ్మద్, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శులు శాంతకుమారి, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జాగీర్ భూములపై హక్కు పత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేసే ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కొంటామని అన్నారు. ఇందుకు అవసరమైన న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసులున్నందున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలు పరిగణలోకి తీసుకునేలా వ్యవహరించాలని సూచించారు.
జాగీరు భూములపై హక్కులు ప్రభుత్వానికే..
జాగీరు భూములపై ప్రభుత్వానికి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని సీఎం స్పష్టం చేశారు. జాగీరు భూములు రద్దయినప్పటికీ వాటిపై హక్కులున్నట్లు పత్రాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కొందరు సబ్ రిజిస్ట్రార్లు వారికి సహకరిస్తున్నారని అన్నారు. వారిని ప్రభుత్వం ఉపేక్షించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని హెచ్చరించారు. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ల దందాపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ అయిందని పేర్కొంటున్న భూమంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. జాగీరు భూములపై హక్కులకు జీపీఏలు సృష్టించి, కోర్టు కేసులలో బలం చేకూరేందుకు అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు వివరించారు. ఇందులో విచారణను కొనసాగించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడమే కుదరదని, అలా చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదని, దానికి చట్టబద్ధత ఉండదని సీఎం స్పష్టం చేశారు.
సబ్ రిజిస్ట్రార్‌దే తప్పు..
భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ‘‘మియాపూర్‌లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ల్యాండ్) రిజిస్ట్రేషన్ కాదు. లిటిగేషన్ రైట్స్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్. ఒకవేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషనే అయితే.. అక్కడున్న భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జి రూ.415 కోట్లు అయ్యేది. కానీ కేవలం రూ.60 లక్షలు కట్టారు. రిజిస్ట్రేషన్ కోసం ఎంతో కొంత కట్టాలి అన్నట్లు కట్టారు తప్ప.. ఈ చార్జి వేయడానికి ఏ ప్రాతిపదిక లేదు. ఇక ఈ భూమిని స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్–1 లో చేయాలి.
కానీ ఇక్కడ చరాస్తి రిజిస్ట్రేషన్ చేసే బుక్–4లో చేశారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్‌కు ఏమాత్రం విలువ లేదు. ఎక్కడా చెల్లుబాటు కాదు’’అని తెలిపింది. ‘‘రద్దయిన జాగీర్ భూములపై హక్కులు సంపాదించడానికి కొందరు గతంలోనే కోర్టులో కేసులు వేశారు. సివిల్ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేసులో తమ వాదనకు బలం చేకూర్చేలా హక్కు పత్రాలు సంపాదించేందుకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిని, బాధ్యులపై చర్యలు తీసుకుంది. రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ ఖజానాకు రూపాయి కూడా నష్టం కలగలేదు. ఒక్క గజం స్థలం కూడా ఎవరి ఆధీనంలోకి పోలేదు. ఇది ప్రభుత్వ భూమి అని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఈ వివరాలను సబ్ రిజిస్ట్రార్లకు పంపింది. అది తెలిసి కూడా సబ్ రిజిస్ట్రార్ భూములను రిజిస్టర్ చేసినట్లు తేలింది. ఇది పూర్తిగా సబ్ రిజిస్ట్రార్ చేసిన తప్పుగానే కనిపిస్తోంది’’అని ప్రభుత్వం పేర్కొంది.
బాలానగర్‌లోనూ అదే..
బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మియాపూర్‌తోపాటు మరో ఏడు గ్రామాల భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేసిన వ్యవహారంలోనూ భూబదలాయింపు రిజిస్ట్రేషన్ జరగలేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘భూమిపై లిటిగేషన్ హక్కులకు రిజిస్ట్రేషన్ జరిగింది. భూమి విలువ ప్రకారం కాకుండా.. ఎంతో కొంత ఫీజు తీసుకోవాలనే ఉద్దేశంతో సబ్ రిజిస్ట్రార్ కేవలం రూ.8 లక్షలకు భూములు రిజిస్ట్రేషన్ చేశారు. బుక్–1 (స్థిరాస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్)లో కాకుండా బుక్–4(చరాస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్)లో చేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మియాపూర్, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు, ఎన్ని ఎకరాలో రాయలేదు. ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు. ఇక్కడ కూడా ఖజానాకు రూపాయి నష్టం జరగలేదు. ఒక్క గజం అన్యాక్రాంతం కాలేదు’’అని వివరించింది.