పోలీసులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.
* పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి
* విధి నిర్వహణలో మరణి ంచినవారికి నష్టపరిహారం పెంపు
* ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి వారికి రూ.50 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.కోటి పరిహారం
* ఏటా 20 మంది ఉత్తమ పోలీసులకు రూ.5 లక్షల నగదు రివార్డు
* పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన
* అమరవీరులు దేవుళ్లతో సమానమంటూ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: పోలీసులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. బతికున్న వారి కోసం తమ బతుకులను త్యాగం చేసే వారు దేవుళ్లతో సమానమని, పోలీసు అమరవీరులు ఆ కోవకు చెందుతారంటూ ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి నెల కొంటేనే అభివృద్ది సాధ్యమని, అందుకు పోలీసు శాఖకు ఎలాంటి సౌకర్యాలు కల్పించేందుకైనా సిద్ధమని స్పష్టంచేశారు. గోషామహల్ స్టేడియం లో మంగళవారం జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలను సవ్యంగా ఉంచాలని పిలుపుని చ్చారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్న పోలీసులను.. ఖాకీలంటూ సినిమాల్లో, పత్రికలలో ఎగతాళి చేయడం సరికాదని కేసీఆర్ అన్నారు.
ఏటా తెలంగాణ పోలీసు మెడల్స్
పోలీసుల జీత భత్యాలు పెంచే విషయంలో గత ప్రభుత్వాలు చులకనగా చూసేవని, కానీ తమ ప్రభుత్వం అందుకు వ్యతిరేకమన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులతో పోరాడుతూ అసువులు బాసిన కానిస్టేబుళ్లు మొదలుకుని ఏఎస్సై స్థాయి వరకు వారికిచ్చే నష్ట పరిహారాన్ని రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సైలకు రూ.45 లక్షలు, సీఐ ఆపై స్థాయి అధికారులకు రూ.50 లక్షలుగా నిర్ణయించామని వెల్లడించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన ఐపీఎస్ అధికారులకు ఇప్పటివరకు అందచేసే నష్టపరిహారాన్ని రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆరో గ్య భద్రత కింద పోలీసులకు ఇదివరకు ఇస్తున్న లక్ష రూపాయలను రూ.5 లక్షలకు పెంచామని, రూ. 2.50 లక్షలు ఉన్న పరిధిని రూ.7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. పోలీసులకు ఇచ్చే రోజు వారీ భత్యాన్ని రూ.90 నుంచి రూ.250కి పెంచుతున్నట్లు చెప్పారు. అమరులైన పోలీసులకు వారి పదవీ విరమణ వరకు పూర్తి జీతంతోపాటు సొంత ఇల్లును కూడా కట్టించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసులకు తెలంగాణ పోలీసు మెడల్స్‌ను ప్రతి ఏటా ప్రధానం చేసి, రూ.5 లక్షల నగదు రివార్డు అందచేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
వారి త్యాగాల ఫలమే: నాయిని
హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడు తూ.. పోలీసుల త్యాగాల కారణంగానే శాంతి యుత వాతావరణంలో బతుకుతున్నామన్న సం గతిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. పోలీ సుల త్యాగాలను ప్రజలు గుర్తించాలని డీజీపీ అనురాగ్ శర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖ పటిష్టతకు సీఎం అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఎస్సై రాములు, కానిస్టేబుళ్లు బసు, ఈశ్వరయ్యలకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ‘అమరులు వీరు’ అనే అనుబంధ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సాయుధ పోలీసు బలగాలు నిర్వహించిన కవాతు, పోలీసు బ్యాండు అమరవీరులను శ్లాఘిస్తూ వినిపిం చిన వాయిద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోలీసు అమరవీరులను కీర్తిస్తూ చిన్నారులు పెయింటింగ్‌లు, క్యారికేచర్లు వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ ఐపీఎస్ అధికారులు, నగర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
సీఎం ప్రసంగంలో మా ప్రస్తావనేదీ..?
అమరవీరుల సంస్మరణ సందర్భంగా పోలీసులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తుంటే.. తమ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకపోవడంపై మహిళా హోంగార్డులు కన్నీరు పెట్టుకున్నారు. గోషామహల్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ పరేడ్‌లో పోలీసులకు ఆర్థికంగా లబ్ధిచేకూర్చే ప్రకటనలతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. తమకూ సీఎం వరాలిస్తారని మహిళా హోంగార్డులు ఎదురుచూస్తూ ప్రసంగం ఆసాంతం ఆసక్తిగా విన్నారు. అలాం టిదేమీ లేకుండా కేసీఆర్ ప్రసంగాన్ని ముగించడంతో నిరాశకు గురయ్యారు.
ఉచిత వైద్య పరీక్షలు..
విధి నిర్వహణలో పోలీసులు వివిధ వ్యాధుల బారినపడుతున్నారని, వ్యాధి లక్షణాలను ఆదిలోనే కనిపెట్టడానికి 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి పోలీసుకు ఆరునెలలకు ఒకసారి సంపూర్ణ వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని సీఎం తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఎస్సై, ఆర్‌ఎస్‌ఐలకు గెజిటెడ్ హోదాకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్ర పోలీసు క్యాంటీన్‌లలో ఖరీదు చేసే వస్తువులపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలియచేశారు. మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా తిరిగే వ్యవస్థ కోసం సింగపూర్‌లాంటి భద్రతా వ్యవస్థ ఇక్కడ కూడా ఏర్పాటు కావాల్సి ఉందని నొక్కి చెప్పారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కేసీఆర్ స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రతా సేవలు అందించే పోలీసులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంపై నివేదిక అందించాల్సిందిగా డీజీపీకి సూచించారు. దిల్‌సుఖ్‌నగర్ వంటి బాంబు పేలుళ్ల ఘటనలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఐటీ కంపెనీల వారిని పునరాలోచింప చేస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు ప్రజాబంధువులుగా నిలవాలని కోరారు.