కరీంనగర్‌ టు కాళేశ్వరం | CM KCR to Visit Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ టు కాళేశ్వరం

Published Fri, Dec 8 2017 11:51 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

CM KCR to Visit Kaleshwaram Project  - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి     కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 9.50 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా     చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పరిశీలనలో భాగంగా బుధవారం సాయంత్రం 5.15 తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేరుకున్నారు. రాత్రి బస అనంతరం ఉదయం జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితాసబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి రెండు హెలికాప్టర్లలో వెళ్లారు.   – సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ భవన్‌లో ఉదయం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ శశాంక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నేతలు బారులు తీరగా కొద్దిసేపు తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్‌ ‘ఆగండి.. తోపులాటలు వద్దు.. అందరినీ కలుస్తా.. అందరితో మాట్లాడుతా..’ అంటూ కరచాలనం చేస్తూ పలకరించారు. ప్రాజెక్టుబాటకు బయలుదేరుతున్న సమయంలోనూ తనను కలిసేందుకు వచ్చిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

కరీంనగర్‌ టు గోలివాడ వరకు.. నేడు కూడా ప్రాజెక్టుల బాట..
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు కరీంనగర్‌ తీగలగుట్టపల్లి తెలంగాణ భవన్‌ నుంచి బయలు దేరిన సీఎం కేసీఆర్‌ మేడిగడ్డ నుంచి గోలివాడ పంపుహౌజ్‌ పనుల తీరును పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదట తుపాకుల గూడెంకు చేరుకుని అక్కడి నుంచి సుమారు ఎనిమిది ప్రాంతాలలో హెలికాప్టర్‌ ద్వారా ఆగుతూ సాగారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ పనులను కన్నెపల్లి, శ్రీపురం, గోలివాడ పంప్‌హౌజ్‌ పనులను ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం శుక్రవారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పనులు పర్యవేక్షించేందుకు రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహంలోనే రాత్రి బస చేశారు. శుక్రవారం కూడా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టుల బాటను సీఎం కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా శుక్రవారం మేడారం, రామడుగు, మల్యాల మండలంలో కొనసాగుతున్న పంప్‌ హౌజ్‌ పనులను, సొరంగ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్‌ అధికారులతో రామడుగులో సమీక్ష సమావేశం నిర్వహించి మధ్యాహ్నం హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ సర్వే మధ్య మానేరు పనుల పురోగతిని పరిశీలించి సాయంత్రం నేరుగా హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement