
కుదరదంటే కుదరదు: కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం కుదరదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. రెవెన్యూ అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఇతర ప్రాంతాలకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబోమని చెప్పారు. ఆంధ్రా విద్యార్థులకు ఇస్తే ఇతర రాష్ట్రాల వారు అడుగుతారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఈ విషయంలో ముందుకెళ్తున్నామని తెలిపారు.
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఆషామాషీగా ధ్రువీకరణ ప్రతాలు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితులకు భూమి ఇచ్చే విషయంలో తమకు తొందర లేదన్నారు. పట్టుబట్టి జట్టు కట్టి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.