‘దక్కన్ ఆటో’ ప్రారంభించిన సీఎం
కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు
పటాన్‌చెరు : జిన్నారం మండలం కొడకంచిలో నూతనంగా ఏర్పాటు చేసిన దక్కన్ ఆటో లిమిటెడ్ పరిశ్రమను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు బస్సులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. 18 మీటర్ల మల్టియాక్సిల్ బస్సుతోపాటు స్కైపాక్ సిటీబస్, 12 మీటర్ల హైఎండ్ లగ్జరీ బస్సులను సీఎం మార్కెట్‌లోకి విడుదల చేశారు. అనంతరం ఆయన పరిశ్రమలోని అన్ని యూనిట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిశ్రమ చైర్మన్ ఎంఎస్‌ఆర్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ వెయ్యి మంది ఉద్యోగులతో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించామన్నారు. త్వరలోనే పరిశ్రమను విస్తరిస్తామన్నారు.
దేశంలోనే అత్యాధునిక సాంకేతికతో బస్సులను రూపొందించామన్నారు. చైనా సాంకేతిక నైపుణ్యం సహకారంతో బస్సులను తయారు చేస్తున్నామన్నారు. స్కూల్ బస్సులతోపాటు ఇతర అవసరాలకు బస్సులు సిద్ధం చేస్తామన్నారు. ఏసీ తదితర అత్యాధునిక వసతులతో పాటు బస్సుల్లో టాయిలెట్లు, ఆడియో వీడియో సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. తమ ఉత్పత్తులను చండీగఢ్, గోవా, అమృత్‌సర్‌లోని రవాణా సంస్థలకు విక్రయిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గోవా కబాడా ట్రాన్స్‌ఫోర్టు ప్రతినిధి రవిచరణ్, అమృత్‌సర్ ట్రాన్స్‌ఫోర్టు కార్పొరేషన్ ప్రతినిధి రోహిత్ పరిగి, చండీగఢ్ రవాణా సంస్థ ప్రతినిధి సౌరవ్‌కు బస్సు తాళాలను అందజేశారు. పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న చైనా జోన్‌టాంగ్ హాలండ్ ప్రతినిధులైన సన్ , జూలను కేసీఆర్ చేతుల మీదుగా సన్మానించారు. పరిశ్రమ ఎండీ వీఏనోర్హి , చైర్మన్ ప్రసాద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, బిగాల గణేష్ గుప్తా, బాబుమోహన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్, కలెక్టర్ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. ఈ ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మూడు బస్సులను కొనుగోలు చేసిన ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వేదికపైనే సీఎం కేసీఆర్ సమక్షంలో పరిశ్రమ అధినేతలతో మాట్లాడి మూడు బస్సులు కొనుగోలు చేశారు.