తట్టా, పార చేతబట్టిన ఎర్రవల్లి..! | The huge response to the call of CM | Sakshi
Sakshi News home page

తట్టా, పార చేతబట్టిన ఎర్రవల్లి..!

Published Sat, Aug 22 2015 3:33 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

తట్టా, పార చేతబట్టిన ఎర్రవల్లి..! - Sakshi

తట్టా, పార చేతబట్టిన ఎర్రవల్లి..!

సీఎం పిలుపునకు భారీ స్పందన
ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమదానం
పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్
 
 గజ్వేల్/జగదేవ్‌పూర్ : ముఖ్యమంత్రి పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది. ఇంటికొకరి చొప్పున తట్టా, పార చేతబట్టి కదిలి వచ్చారు. రోజంతా శ్రమదానం చేసి ఊరిని బాగు చేసుకున్నారు.  ‘చెత్తపై యుద్ధం చేద్దా’మంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం పిలుపుఇచ్చిన నేపథ్యంలో జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వాసులు శుక్రవారం శ్రమదానంలో పాల్గొనడానికి ఉత్సాహంగా కదిలి వచ్చారు.  సీఎం శుక్రవారం ఉదయం 10 గంటలకు తన వ్యవసాయ క్షేత్రం నుంచి గ్రామానికి వచ్చారు. వస్తూనే.. ఎరుకలి నర్సవ్వ ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి పనులు ప్రారంభించారు. పారతో మట్టి తవ్వి తట్టతో ట్రాక్టర్‌లో పోశారు.

అక్కడి నుంచి వాటర్ ట్యాంకు వద్దకు వచ్చి కొద్ది సేపు పక్కనే ఉన్న చెరువును పరిశీలించారు. అనంతరం జనాలు పని చేసే స్థలాలకు వెళ్లి పనులను పర్యవేక్షించారు. అక్కడ నుంచి నడుచుకుంటూ చాకలి మైసయ్య ఇంటికి వెళ్లి ఇంటి పరిస్థితిని సమీక్షించారు. ఇల్లు కూలిపోతోందని బాధ పడవద్దని త్వరలో కొత్త ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి బీసీ కాలనీలోకి వెళ్లి  పాత ఇండ్లను పరిశీలించారు. సలేంద్ర భవాని అనే మహిళ తన గోడును సీఎంకు విన్నవించారు.

సరేనమ్మా..మీ బాధలు తీర్చడానికే వచ్చా అంటూ హామీ ఇచ్చారు. మళ్లీ వెనుకకు మళ్లి గ్రామ పంచాయతీ మీదుగా సర్పంచ్ ఇంటి గల్లీలో పర్యటించారు. అక్కడ కూలగొడుతున్న ఇండ్లను పరిశీలించారు. ఈ వాడల్లో ఎన్ని ఇండ్లు కూలగొడుతున్నారు..ఎంత మంది ఇండ్లు విడిచిపెట్టి వెళ్లారు అనే విషయాలను  ‘గడా’ అధికారి హన్మంతరావును, సర్పంచ్ భాగ్యను ఆడిగి తెలుసుకున్నారు. అనంతర  పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు.

 నర్సయ్య నిన్ను నడిపిస్తా...
 పాదయాత్ర చేస్తూ బీసీ కాలనీలోకి వెళ్లిన సీఎంకు  అక్కడ కింద కూర్చున్న ఓ వ్యక్తి కనిపించారు. వెంటనే సీఎం  ఏమయ్య ఏమైంది ఇంట్లోనే ఉన్నావంటూ పలకరించారు. ఏం చెప్పాలి సారూ.. కాళ్లు చచ్చిపడి పోయి ఏళ్లు గడిచినయి.. డాక్టర్లను కలిస్తే లక్షల రూపాయలవుతాయి అన్నారు.. పైసల్లేక ఇలా ఇంటికే పరిమితమైనా అన్నారు. వెంటనే సీఎం సరే  నర్సయ్య.. నీ కాళ్లు బాగజేసే బాధ్యత నాదే అంటూ పక్కనే ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు.

 రోడ్డు పక్కన ఈ తుమ్మ చెట్లు ఏమిటీ..
 సీఎం అంబేడ్కర్ చౌరస్తా నుంచి రోడ్డు మీదుగా వెళుతూ ఏమాయ్య కిష్టారెడ్డి నిన్ననే చెప్పా కాదా ఈ సర్కార్ తుమ్మ చెట్లు ఏమిటీ, ఇవన్నీ తీసేయాలి అంటూ టీఆర్‌ఎస్‌నేతకు సూచించారు. పక్కనే చెత్తను తొలగిస్తున్న మహిళలను చూసి బాగా పని చేయండి..నేను కూడా చేస్తా అంటూ ముందుకు కదిలారు.

 సారూ మేం రోడ్డున పడ్డాం మీరే దిక్కు..
 సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో పాదయాత్ర చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాప్రాలో పని చేస్తున్న 30 మందికి పైగా మున్సిపల్ కార్మికులు మహిళలు, పురుషులు ఎర్రవల్లికి వచ్చి అంగన్‌వాడీ కేంద్రం వద్ద సీఎం కాళ్లపై పడి, వినతిపత్రం అందించారు. సరేనంటూ సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారు. అక్కడే కుర్చీపై కుర్చోని మహిళల సమస్యలు తెలుసుకున్నారు.  

 పనులు మంచిగా చేయాలి..
 ఇండ్ల కూలగొట్టే పనులు మంచిగా చేపట్టాలి అందరు పాల్గొనేలా అధికారులు చూడాలి.. ఎవరికి చెప్పిన పని వారు చేసేలా తగిన చర్యలు చేపట్టాలి అంటూ సీఎం కేసీఆర్.. కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రామిరెడ్డి, గడా అధికారి హన్మంతరావులకు ఆదేశించారు. ఎన్ని ఇండ్లను గుర్తించారని సీఎం  ఆడగడంతో  గ్రామంలో 358 పెంకుటిళ్లను గుర్తించామని, 115 ఇండ్లను కూలగొడుతున్నామని వారు వివరించారు.   ఈ రోజు 80 ఇండ్లను కూలగొట్టేందుకు ప్రజలు ఒప్పుకున్నారన్నారు.

 సీసీ రోడ్ల ఎత్తు పెంచండి...
 ఎస్సీ, బీసీ కాలనీలో వేసిన సీసీ రోడ్లన్నీ ఎత్తు పెంచాలి.. కిందకు ఉంటే వానొస్తే నీళ్లు ఇండ్లలోకి పోతాయని వెంటనే ఆ రోడ్ల ఎత్తు పెంచాలంటూ సీఎం  అధికారులకు సూచించారు. దళిత కాలనీలో పర్యటిస్తూ పని చేస్తున్న వారిని చూసి మెచ్చుకున్నారు. ఇండ్లు లేదని తనకు ఇల్లు కావాలని సీఎంకు దళిత మహిళ నర్సవ్వ సీఎంకు విన్నవించుకుంది. ఇల్లు కట్టేందుకే పాత ఇళ్లను తొలగిస్తున్నామంటూ సీఎం హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన 10 మంది విద్యార్థినులు తమకు సైకిళ్లు కావాలని సీఎంకు వినతి పత్రం అందించారు. వెంటనే సీఎం పక్కనే ఉన్న గడా అధికారిని వారి సమస్యను పరిష్కరించమంటూ ఆదేశించారు.

ఇలా శుక్రవారం సీఎం పర్యటన ప్రజల మధ్య పారిశుద్ధ్య పనుల మధ్య కొనసాగింది. 12.48 గంటలకు కిష్టారెడ్డి ఇంటికెళ్లి కొబ్బరి నీళ్లు తాగారు. అక్కడే గంటన్నరకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ వెంకట్రామిరెడ్డితో కొద్ది సేపు చర్చించారు. 2.20 గంటలకు  గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. 2.50 గంటలకు మళ్లీ కిష్టారెడ్డి ఇంటికి చేరుకున్నారు.  అక్కడే సాయంత్రం 5.20 గంటలకు మళ్లీ గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడారు. గ్రామానికి చెందిన 9 మంది దాతలను సన్మానించారు. 6.25 గంటలకు పనులను ముగించి వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement