mp prabhakar reddy
-
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సివిల్ సర్వీస్ స్టడీ శిక్షణ టూర్లో భాగంగా సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన నాగలాండ్‌కు చెందిన 12 మంది ప్రతినిధులతో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు ఆడపిల్లల వివాహనికి కల్యాణలక్ష్మి అందిస్తుందన్నారు. ఉచిత విద్యలో భాగంగా ప్రతీ విద్యార్థిపైన రూ.లక్ష ఖర్చు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో వైద్య, విద్యకు పెద్దపీట వేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. నాగలాండ్ బృందాన్ని హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ రుచి చూడాలని కోరారు. నాగలాండ్‌లో జరుగుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలను సివిల్ సర్వీస్ శిక్షణ పొందుతున్న ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నాగలాండ్ ప్రతినిధులు గజ్వేల్‌లో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ కార్యాలయంతో పాటు మార్కెట్, కోమటిచెరువు, ఆక్సిజన్ పార్క్ సందర్శించారన్నారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలో ఏక్కడా లేవని పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను చూసి ఇవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ కందుకూరు ఉషారాణి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిట్‌ఫండ్ సంస్థలపై నిఘా పెట్టండి: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చిట్‌ఫండ్ సంస్థల మోసాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో చిట్‌ఫండ్స్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చిన్నచిన్న మొత్తాలు దాచుకున్న ప్రజలను పలు సంస్థలు సులువుగా మోసం చేస్తున్నాయని, డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్థలపై నిఘా ఉండేలా నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. మోసపూరిత సంస్థల నుంచి తిరిగి డబ్బు వసూలుకు ఇప్పటివరకు ప్రత్యేక చట్టమే లేకుండాపోయిందన్నారు. మోసాలు జరిగిన తరువాతే చట్టాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. చిట్‌ఫండ్ సంస్థల మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావాన్ని చూపే అవకాశం ఉండటంతో, ఇలాంటి మోసాలకు తావివ్వకుండా పటిష్ట వ్యవస్థ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. -
కేసీఆర్ లక్ష మెజార్టీతో గెలుస్తాడు: ఎంపీ కేపీఆర్
జగదేవ్‌పూర్(గజ్వేల్): రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని, కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుని బహుమతిగా అందిస్తామని, కాంగ్రెసోళ్లకు సీట్లు నోట్లు కావాలి తప్ప ప్రజల బాగోగలు పట్టవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం జగదేవ్‌పూర్‌లో అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా నిజాయితీ గల వ్యక్తులు లేరని, అందరిపైన కేసులు, దొంగ దందాలు ఉన్న వ్యక్తులేనని ఆరోపించారు. వారికి పదవులు తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ధ్యాస లేదని విమర్శించారు. సీట్లు నోట్లు కోసమే ఎమ్మెల్యే టిక్కెట్లకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కళ్ల ముందే గజ్వేల్‌లో అభివృద్ధి కనిపిస్తుందని, ఇదే ఆదర్శంగా తెలంగాణ మొత్తం జరుగుతుందన్నారు. సమావేశంలో గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు గుండా రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు పండరీ రవీందర్రావు, కల్యాణ్కర్ నర్సింగ్‌రావు, ముద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, ఎంపీటీసీ వెంకటయ్య, మాజీ సర్పంచ్‌లు కరుణాకర్, సుధాకర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మునీర్, జిల్లా యూత్ నాయకులు సంతోష్‌రెడ్డి, గజ్వేల్ మండలాధ్యక్షులు బెండ మధు, నాయకులుతదితరులు పాల్గొన్నారు. -
సహకరిస్తాం.. పనులు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలోని వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను రైల్వే జీఎంతో చర్చించారు. - ఎంఎంటీఎస్ ఫేజ్–2లో భాగంగా చేపట్టిన తెల్లాపూర్–రామచంద్రాపురం లైన్‌ను వెంటనే ప్రారంభించాలని జీఎంను ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉందని, అవి రాగానే ప్రారంభిస్తామని జీఎం చెప్పారు. - తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మార్గంలోని రైల్వే అండర్ పాస్ ఇరుగ్గా మారిందని, దీనిని విస్తరించాలని ఎంపీ కోరారు. ఇందుకోసం రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేయించేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఎంపీ తెలిపారు. నిధులు విడుదల చేస్తే, పనులు మొదలుపెట్టేందుకు అభ్యంతరం లేదని జీఎం సమాధానమిచ్చారు. - కొల్లూరు సర్వీసు రోడ్డు వద్ద ఉన్న రైల్వేట్రాక్‌పై ఆర్వోబీ నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. హెచ్ఎండీఏ– రైల్వే అధికారులకు ఈ విషయంలో సమన్వయం కొరవడిన కారణంగా ఈ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కోరగా డీపీఆర్ సిద్ధమై నిధులు విడుదలైతే వెంటనే మొదలుపెడతామని జీఎం హామీనిచ్చారు. - ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనికోసం అక్కడ 300 ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే అక్కడ 150 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. ఇక మిగిలిన 150 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీఎంకు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎండీఏ– రైల్వే అధికారులు చీఫ్ సెక్రటరీ జోషీతో కలసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశానని ఎంపీ తెలిపారు. -
జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలు షురూ
సిద్దిపేట ఎడ్యుకేషన్ : క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి క్రీడాకారులకు సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో దేశపతాకాన్ని ఎగరవేయాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలను ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 29 రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పోటీలు నిర్వహించే అవకాశం రావడం సంతోషమన్నారు. ముఖ్యంగా నూతన సిద్దిపేట జిల్లాలో ఈ పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇదే మైదానంలో తాము ఆడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 29 రాష్ట్రాల నుంచి ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ మాట్లాడుతూ సిద్దిపేట వ్యాయామ ఉపాధ్యాయులు వేతనం కోసం కాకుండా నిబద్ధతతో పనిచేస్తారని కొనియాడారు. సారేజహాస్సే అచ్చా గీతం పాకిస్తాన్లో వినిపించేలా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య కోశాధికారి ప్రీత్‌పాల్‌సింగ్ సలూజ, మహిళా కోచ్ శివాజీషిండే, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రంగారావు, హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్‌బీఏ) రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, కోశాధికారి రమేశ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి దామెర మల్లేశం, అరుణాచల్ ప్రదేశ్ కార్యదర్శి నబాకులెరా, సిద్దిపేట స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సుజాతలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటిరోజు లీగ్ పోటీల్లో.. జాతీయహ్యాండ్బాల్ పోటీల్లో మొదటి రోజు లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగా>ణ, అరుణాచల్‌ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, పాండిచ్చేరి, నేషనల్ హ్యాండ్‌బాల్ అకాడమీ, మహారాష్ట్ర, డిల్లీ, మణిపూర్ తదితర జట్లు తలపడ్డాయి. అంతకు ముందు తెలంగాణ అరుణాచల్‌ప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో తెలంగాణ జట్టు 27 పాయింట్లు సాధించగా, అరుణాచల్‌ప్రదేశ్ 3 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది. -
కాంగ్రెసోళ్లకు మనుసున పడ్తలేదు
►చేతి వృత్తులకు పూర్వవైభవం తెస్తామన్న మంత్రి హరీశ్‌రావు ►కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైనుకు భూమిపూజ సాక్షి, సిద్దిపేట: సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంబరపడుతుంటే.. కాంగ్రెసోళ్లు గుండెలు బాదుకుంటున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైనుకు భూమిపూజ చేశారు. 3,344 మందికి సాదా బైనామా పట్టాలు, 774 మంది ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ. 33.74 కోట్ల బ్యాంకు లింకేజీ, 814 గ్రూపులకు 19.24 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతివృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిస్తే.. కాంగ్రెస్ వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మరిన్ని నిధులు పెంచామని, అదనంగా రూ. 25 వేలు పెంచి మొత్తం రూ.75,116 ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మనుసున పడతలేదన్నారు. ఇక మానసిక హింస ఉండదు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని హరీశ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ఇస్తామని, వీటితో పాటు రూ. 2 వేల విలువైన కేసీఆర్ కిట్టు కూడా ఇస్తామన్నారు. -
పనుల్లో నాణ్యతాలోపాన్ని సహించం
గడువులోగా అభివృద్ధి జరగాలి సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపాన్ని సహించేది లేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని ‘గడా’ కార్యాలయంలో ఓఎస్డీ హన్మంతరావుతో కలిసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీలేదన్నారు. ‘గడా’ కార్యాలయంలో వారానికోసారి నిర్వహిస్తున్న సమీక్షకు అధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లు తప్పనిసరిగా హాజరై ప్రగతిపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉందన్నారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం చూసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్), పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల పనులను మండలాల వారీగా సమీక్షించారు. కొన్నిచోట్ల స్థల సేకరణలో జాప్యం, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనుల్లో వేగంగా పుంజుకోవడం లేదన్నారు. ఈ సమీక్షలో ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య, డిప్యూటీ ఈఈ బాలప్రసాద్, ఈడబ్ల్యూ ఐడీసీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, కమిషనర్ శంకర్, ఎంపీపీలు చిన్న మల్లయ్య, రేణుక, జెడ్పీటీసీ జేజేల వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటి సమస్యకు ‘మిషన్ భగీరథ’
కొండపాక: మిషన్ భగీరథతో నియోజక వర్గంలో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాన మంత్రి మోదీచే ప్రారంభించే మిషన్ భగీరథ పథక సమావేశానికి జన సమీకరణ కోసం మండలంలోని దుద్దెడలో బుదవారం సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజక వర్గంలో అన్ని కుటుంబాలకు నల్లాల ద్వారా గోదావరి నదీ జలాలను అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం నియోజక వర్గ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమన్నారు. కేవలం 6 నెలల కాలంలో కొండపాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, తూప్రాన్, ములుగు మండలాల్లోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, జెడ్పీటీసీ మాధూరి, ఎంపీపీ అనంతుల పద్మ, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షులు దోమల ఎల్లం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఏర్పుల యాదయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఖమ్మంపల్లి మల్శేశం, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాదాకిషన్‌రెడ్డి, డీబీఎస్ రాష్ట అధ్యక్షులు దేవి రవీందర్, సర్పంచ్‌లు, మాజీ ఎంపీపీ బొద్దుల కనుకయ్య, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గోన్నారు. -
తట్టా, పార చేతబట్టిన ఎర్రవల్లి..!
సీఎం పిలుపునకు భారీ స్పందన ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమదానం పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్/జగదేవ్‌పూర్ : ముఖ్యమంత్రి పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది. ఇంటికొకరి చొప్పున తట్టా, పార చేతబట్టి కదిలి వచ్చారు. రోజంతా శ్రమదానం చేసి ఊరిని బాగు చేసుకున్నారు. ‘చెత్తపై యుద్ధం చేద్దా’మంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం పిలుపుఇచ్చిన నేపథ్యంలో జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వాసులు శుక్రవారం శ్రమదానంలో పాల్గొనడానికి ఉత్సాహంగా కదిలి వచ్చారు. సీఎం శుక్రవారం ఉదయం 10 గంటలకు తన వ్యవసాయ క్షేత్రం నుంచి గ్రామానికి వచ్చారు. వస్తూనే.. ఎరుకలి నర్సవ్వ ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి పనులు ప్రారంభించారు. పారతో మట్టి తవ్వి తట్టతో ట్రాక్టర్లో పోశారు. అక్కడి నుంచి వాటర్ ట్యాంకు వద్దకు వచ్చి కొద్ది సేపు పక్కనే ఉన్న చెరువును పరిశీలించారు. అనంతరం జనాలు పని చేసే స్థలాలకు వెళ్లి పనులను పర్యవేక్షించారు. అక్కడ నుంచి నడుచుకుంటూ చాకలి మైసయ్య ఇంటికి వెళ్లి ఇంటి పరిస్థితిని సమీక్షించారు. ఇల్లు కూలిపోతోందని బాధ పడవద్దని త్వరలో కొత్త ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి బీసీ కాలనీలోకి వెళ్లి పాత ఇండ్లను పరిశీలించారు. సలేంద్ర భవాని అనే మహిళ తన గోడును సీఎంకు విన్నవించారు. సరేనమ్మా..మీ బాధలు తీర్చడానికే వచ్చా అంటూ హామీ ఇచ్చారు. మళ్లీ వెనుకకు మళ్లి గ్రామ పంచాయతీ మీదుగా సర్పంచ్ ఇంటి గల్లీలో పర్యటించారు. అక్కడ కూలగొడుతున్న ఇండ్లను పరిశీలించారు. ఈ వాడల్లో ఎన్ని ఇండ్లు కూలగొడుతున్నారు..ఎంత మంది ఇండ్లు విడిచిపెట్టి వెళ్లారు అనే విషయాలను ‘గడా’ అధికారి హన్మంతరావును, సర్పంచ్ భాగ్యను ఆడిగి తెలుసుకున్నారు. అనంతర పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు. నర్సయ్య నిన్ను నడిపిస్తా... పాదయాత్ర చేస్తూ బీసీ కాలనీలోకి వెళ్లిన సీఎంకు అక్కడ కింద కూర్చున్న ఓ వ్యక్తి కనిపించారు. వెంటనే సీఎం ఏమయ్య ఏమైంది ఇంట్లోనే ఉన్నావంటూ పలకరించారు. ఏం చెప్పాలి సారూ.. కాళ్లు చచ్చిపడి పోయి ఏళ్లు గడిచినయి.. డాక్టర్లను కలిస్తే లక్షల రూపాయలవుతాయి అన్నారు.. పైసల్లేక ఇలా ఇంటికే పరిమితమైనా అన్నారు. వెంటనే సీఎం సరే నర్సయ్య.. నీ కాళ్లు బాగజేసే బాధ్యత నాదే అంటూ పక్కనే ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్డు పక్కన ఈ తుమ్మ చెట్లు ఏమిటీ.. సీఎం అంబేడ్కర్ చౌరస్తా నుంచి రోడ్డు మీదుగా వెళుతూ ఏమాయ్య కిష్టారెడ్డి నిన్ననే చెప్పా కాదా ఈ సర్కార్ తుమ్మ చెట్లు ఏమిటీ, ఇవన్నీ తీసేయాలి అంటూ టీఆర్ఎస్నేతకు సూచించారు. పక్కనే చెత్తను తొలగిస్తున్న మహిళలను చూసి బాగా పని చేయండి..నేను కూడా చేస్తా అంటూ ముందుకు కదిలారు. సారూ మేం రోడ్డున పడ్డాం మీరే దిక్కు.. సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో పాదయాత్ర చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాప్రాలో పని చేస్తున్న 30 మందికి పైగా మున్సిపల్ కార్మికులు మహిళలు, పురుషులు ఎర్రవల్లికి వచ్చి అంగన్వాడీ కేంద్రం వద్ద సీఎం కాళ్లపై పడి, వినతిపత్రం అందించారు. సరేనంటూ సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారు. అక్కడే కుర్చీపై కుర్చోని మహిళల సమస్యలు తెలుసుకున్నారు. పనులు మంచిగా చేయాలి.. ఇండ్ల కూలగొట్టే పనులు మంచిగా చేపట్టాలి అందరు పాల్గొనేలా అధికారులు చూడాలి.. ఎవరికి చెప్పిన పని వారు చేసేలా తగిన చర్యలు చేపట్టాలి అంటూ సీఎం కేసీఆర్.. కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జేసీ వెంకట్రామిరెడ్డి, గడా అధికారి హన్మంతరావులకు ఆదేశించారు. ఎన్ని ఇండ్లను గుర్తించారని సీఎం ఆడగడంతో గ్రామంలో 358 పెంకుటిళ్లను గుర్తించామని, 115 ఇండ్లను కూలగొడుతున్నామని వారు వివరించారు. ఈ రోజు 80 ఇండ్లను కూలగొట్టేందుకు ప్రజలు ఒప్పుకున్నారన్నారు. సీసీ రోడ్ల ఎత్తు పెంచండి... ఎస్సీ, బీసీ కాలనీలో వేసిన సీసీ రోడ్లన్నీ ఎత్తు పెంచాలి.. కిందకు ఉంటే వానొస్తే నీళ్లు ఇండ్లలోకి పోతాయని వెంటనే ఆ రోడ్ల ఎత్తు పెంచాలంటూ సీఎం అధికారులకు సూచించారు. దళిత కాలనీలో పర్యటిస్తూ పని చేస్తున్న వారిని చూసి మెచ్చుకున్నారు. ఇండ్లు లేదని తనకు ఇల్లు కావాలని సీఎంకు దళిత మహిళ నర్సవ్వ సీఎంకు విన్నవించుకుంది. ఇల్లు కట్టేందుకే పాత ఇళ్లను తొలగిస్తున్నామంటూ సీఎం హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన 10 మంది విద్యార్థినులు తమకు సైకిళ్లు కావాలని సీఎంకు వినతి పత్రం అందించారు. వెంటనే సీఎం పక్కనే ఉన్న గడా అధికారిని వారి సమస్యను పరిష్కరించమంటూ ఆదేశించారు. ఇలా శుక్రవారం సీఎం పర్యటన ప్రజల మధ్య పారిశుద్ధ్య పనుల మధ్య కొనసాగింది. 12.48 గంటలకు కిష్టారెడ్డి ఇంటికెళ్లి కొబ్బరి నీళ్లు తాగారు. అక్కడే గంటన్నరకు పైగా విశ్రాంతి తీసుకున్నారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ వెంకట్రామిరెడ్డితో కొద్ది సేపు చర్చించారు. 2.20 గంటలకు గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. 2.50 గంటలకు మళ్లీ కిష్టారెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడే సాయంత్రం 5.20 గంటలకు మళ్లీ గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడారు. గ్రామానికి చెందిన 9 మంది దాతలను సన్మానించారు. 6.25 గంటలకు పనులను ముగించి వ్యవసాయక్షేత్రానికి వెళ్లారు. -
‘దక్కన్ ఆటో’ ప్రారంభించిన సీఎం
కార్యక్రమానికి హాజరైన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పటాన్చెరు : జిన్నారం మండలం కొడకంచిలో నూతనంగా ఏర్పాటు చేసిన దక్కన్ ఆటో లిమిటెడ్ పరిశ్రమను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు బస్సులను మార్కెట్లోకి విడుదల చేశారు. 18 మీటర్ల మల్టియాక్సిల్ బస్సుతోపాటు స్కైపాక్ సిటీబస్, 12 మీటర్ల హైఎండ్ లగ్జరీ బస్సులను సీఎం మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఆయన పరిశ్రమలోని అన్ని యూనిట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిశ్రమ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ మాట్లాడుతూ వెయ్యి మంది ఉద్యోగులతో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించామన్నారు. త్వరలోనే పరిశ్రమను విస్తరిస్తామన్నారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతో బస్సులను రూపొందించామన్నారు. చైనా సాంకేతిక నైపుణ్యం సహకారంతో బస్సులను తయారు చేస్తున్నామన్నారు. స్కూల్ బస్సులతోపాటు ఇతర అవసరాలకు బస్సులు సిద్ధం చేస్తామన్నారు. ఏసీ తదితర అత్యాధునిక వసతులతో పాటు బస్సుల్లో టాయిలెట్లు, ఆడియో వీడియో సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. తమ ఉత్పత్తులను చండీగఢ్, గోవా, అమృత్‌సర్‌లోని రవాణా సంస్థలకు విక్రయిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గోవా కబాడా ట్రాన్స్‌ఫోర్టు ప్రతినిధి రవిచరణ్, అమృత్సర్ ట్రాన్స్‌ఫోర్టు కార్పొరేషన్ ప్రతినిధి రోహిత్ పరిగి, చండీగఢ్ రవాణా సంస్థ ప్రతినిధి సౌరవ్‌కు బస్సు తాళాలను అందజేశారు. పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న చైనా జోన్టాంగ్ హాలండ్ ప్రతినిధులైన సన్ , జూలను కేసీఆర్ చేతుల మీదుగా సన్మానించారు. పరిశ్రమ ఎండీ వీఏనోర్హి , చైర్మన్ ప్రసాద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, బిగాల గణేష్ గుప్తా, బాబుమోహన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్, కలెక్టర్ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. ఈ ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మూడు బస్సులను కొనుగోలు చేసిన ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వేదికపైనే సీఎం కేసీఆర్ సమక్షంలో పరిశ్రమ అధినేతలతో మాట్లాడి మూడు బస్సులు కొనుగోలు చేశారు. -
‘స్వచ్ఛ గజ్వేల్’కు శ్రీకారం
వారం రోజులపాటుకార్యక్రమాలు అధికారులకు వార్డుల వారీగా బాధ్యతలు {పారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గజ్వేల్ : ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తిగా ‘స్వచ్ఛ గజ్వేల్’ కార్యక్రమాన్ని శనివారం స్థానిక నగర పంచాయతీలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పరిశుభ్రత ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇందిరా పార్క్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ‘స్వచ్ఛ గజ్వేల్’కు సంబంధించి నియమితులైన అధికారులు తమ తమ వార్డుల్లో చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ పలు వార్డులను సందర్శించారు. అనంతరం కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... పారిశుద్ధ్య పనులు ఉద్యమ స్థాయిలో సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనే గజ్వేల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రధానంగా పారిశుద్ధ్య లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఇందుకోసం వారం రోజులపాటు ‘స్వచ్ఛ గజ్వేల్’ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగనుందని చెప్పారు. పట్టణంలో ప్రస్తుతం మటన్ మార్కెట్ల వద్ద వాతావరణం మెరుగు పడాల్సి ఉందన్నారు. నగర పంచాయతీ కార్యాలయ వెనుక భాగం నుంచి జాలిగామ బైపాస్ రోడ్డును కలుపుతూ కొత్తగా ఫార్మేషన్ రోడ్డు నిర్మిస్తామన్నారు. మూడు చోట్ల డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రోడ్ల చెత్త చెదారం పడేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పట్టణంలోని 500 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశలో భూగర్భ డ్రైనేజీ విధానాన్ని తీసుకురావాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా గజ్వేల్ నగర పంచాయతీని తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, నగర పంచాయతీ కమిషనర్ ఎన్.శంకర్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఆకుల దేవేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.