కార్యక్రమంలో మంత్రి హరీశ్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సివిల్ సర్వీస్ స్టడీ శిక్షణ టూర్‌లో భాగంగా సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన నాగలాండ్‌కు చెందిన 12 మంది ప్రతినిధులతో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు పెన్షన్‌లతోపాటు ఆడపిల్లల వివాహనికి కల్యాణలక్ష్మి అందిస్తుందన్నారు. ఉచిత విద్యలో భాగంగా ప్రతీ విద్యార్థిపైన రూ.లక్ష ఖర్చు చేస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ చొరవతో వైద్య, విద్యకు పెద్దపీట వేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. నాగలాండ్ బృందాన్ని హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ రుచి చూడాలని కోరారు. నాగలాండ్‌లో జరుగుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలను సివిల్ సర్వీస్ శిక్షణ పొందుతున్న ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నాగలాండ్ ప్రతినిధులు గజ్వేల్‌లో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ కార్యాలయంతో పాటు మార్కెట్, కోమటిచెరువు, ఆక్సిజన్ పార్క్ సందర్శించారన్నారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలో ఏక్కడా లేవని పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న డబుల్‌బెడ్రూం ఇళ్లను చూసి ఇవి దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ కందుకూరు ఉషారాణి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment