సమీక్షలో మాట్లాడుతున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
గడువులోగా అభివృద్ధి జరగాలి
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచన
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపాన్ని సహించేది లేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని ‘గడా’ కార్యాలయంలో ఓఎస్డీ హన్మంతరావుతో కలిసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీలేదన్నారు. ‘గడా’ కార్యాలయంలో వారానికోసారి నిర్వహిస్తున్న సమీక్షకు అధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లు తప్పనిసరిగా హాజరై ప్రగతిపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉందన్నారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం చూసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల పనులను మండలాల వారీగా సమీక్షించారు.
కొన్నిచోట్ల స్థల సేకరణలో జాప్యం, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనుల్లో వేగంగా పుంజుకోవడం లేదన్నారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్‌నర్సయ్య, డిప్యూటీ ఈఈ బాలప్రసాద్, ఈడబ్ల్యూ ఐడీసీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, కమిషనర్ శంకర్, ఎంపీపీలు చిన్న మల్లయ్య, రేణుక, జెడ్పీటీసీ జేజేల వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.