
కట్టెలు కొట్టి.. బొగ్గుగా మార్చి
కనిపించని ‘హరితహారం’
గ్రామాల్లో బుగ్గి అవుతున్న పచ్చదనం
హైదరాబాద్‌కు తరలుతున్న బొగ్గు
పట్టింపులేని అధికార గణం
పాలకుర్తి : చెరువు శిఖాలు, గుట్టలు, వ్యవసాయం చేయకుండా వృథాగా ఉన్న భూముల్లో ఉన్న చెట్లను నరికించి బొగ్గు వ్యాపారులు లాభాలార్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరికించి బట్టీలు పెట్టి బొగ్గును బస్తాల్లో నింపి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తున్న ప్రభుత్వం యథేచ్ఛగా చెట్లు నరికివేస్తుంటే పట్టింపులేకుండా వ్యవహరిస్తుంది. మండలంలోని ముత్తారం, లక్ష్మినారాయణపురం, గూడూరు, తిర్మలగిరి, ఇరవెన్ను, వావిలాల, మల్లంపల్లి గ్రామాల్లో బొగ్గుబట్టీల వ్యవహారం కొనసాగుతుంది. బొగ్గు బట్టీల కోసం ప్రతిరోజు వేలాది చెట్లు ఆహుతి అవుతున్నాయి. మరో హరితహారం పేరిట చెట్లను పెంచాలని నాటిన లక్షలాది మొక్కలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. చెట్ల నరికి వేతపై సంబందితాధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఒక చెట్టు నరికితే పది మొక్కలు పెంచాలి
ఒక చెట్టు నరికితే పది మొక్కలు నాటించే బాధ్యత తీసుకోవాలి. ప్రతిఒక్కరూ మొక్కలు నాటితే హరిత తెలంగాణ సాధ్యమౌతుంది. మొక్కుబడిగా మొక్క ల పెంపకం చేపడితే ఫలితాలు ఉండవు. చిత్తశుద్దితో మొక్కల పెంపకం చేపట్టాలి.
- ఇమ్మడి అశోక్, ఉపాధ్యాయుడు, అయ్యంగారిపల్లి
చెట్ల నరికివేతను అరికడతాం
మండలంలో అనుమతి లేని చెట్ల నరికివేతను అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతాం. చెట్లు నరికివేయడం మానుకొని చెట్లను పెంచాలనే అవగాహన ప్రతిఒక్కరూ కలిగిఉండాలి.
- బి.బన్సీలాల్, తహసీల్దార్, పాలకుర్తి