ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య ముదిరిన విభేదాలు
ఎమ్మెల్యే కొడుకు పెత్తనంపై కినుక
అధికారుల తీరుపై ఆగ్రహం
ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరం
రద్దయిన మంత్రి ఈటల రాజేందర్
పర్యటన
గోదావరిఖని : కుందనపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమం, రామగుండంలో జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ, గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం పాల్గొనాల్సి ఉంది. మంత్రి పర్యటనపై నాలుగు రోజుల ముందు నుంచే టీఆర్‌ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసే శిలాఫలకంతోపాటు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం రామగుండం నియోజకవర్గంలో పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత మంథనిలో మంత్రి పర్యటించేందుకు చర్యలు చేపట్టారు.
అరుుతే రామగుండం, గోదావరిఖనిలో కార్యక్రమాలకు హాజరుకావాల్సిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ ఆడెప రాజేశం, రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఉదయం నుంచే అందుబాటులో లేకుండాపోయారు. వారి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో నాయకులు, అధికారులు అయోమయంలో పడ్డారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సైతం సదరు ప్రజాప్రతినిధుల ఇళ్లకు అనుచరులను పంపించి ఆరా తీసినట్టు సమాచారం.
మండలంతోపాటు కార్పొరేషన్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ రామగుండం కార్యక్రమాలను రద్దు చేసుకుని మంథని నియోజకవర్గ పర్యటనకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఎంపీని సంప్రదించగా... మంత్రి హుజూరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నందున సమయం సరిపోవడం లేదని రామగుండం పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయితే మంత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించకపోవడం గమనార్హం.
అధికారులపై కినుకతోనే..?
మంత్రి ఈటల రాజేందర్ పర్యటనకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీలకు, కార్పొరేషన్‌కు చెందిన ఇతర ప్రజాప్రతినిధులకు వీఆర్‌ఓల ద్వారా సమాచారం పంపించడంతో వారు అవమా నంగా భావించినట్లు తెలుస్తోంది. అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, తమ పరిస్థితి మంత్రికి తెలియాలనే ఉద్దేశంతోనే పర్యటనకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది.
దీనికితోడు ఎమ్మెల్యే కుమారుడికి అధికారికంగా ఏ పదవీ లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు సైతం ఆయనకే ప్రాధాన్యతనిస్తూ తమను చులకన చేస్తున్నారనే భావన కూడా నెలకొంది. పోలీస్‌స్టేషన్లు, మండల కార్యాలయూల్లో అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారని, ఇందుకు ఎమ్మెల్యే తనయుడే కారణమని గతంలోనే పార్టీ అధిష్టానానికి, జిల్లా నాయకులకు తెలిపినా పట్టించుకోలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే ప్రజాప్రతినిధులు మంత్రి పర్యటన కు అందుబాటులో లేరని తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న అంతర్గత పోరుపై దృష్టి సారించకపోతే విభేదాలు మరింత ముదిరిపోయే ప్రమాదముందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రామగుండం టీఆర్‌ఎస్‌లో కోల్డ్‌వార్
Published Fri, Aug 21 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement