పరమావధి..!
మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే పరమావధిగా పలు రాజకీయ పార్టీలు కలిసొచ్చే సమీకరణాలపై దృష్టిసారించాయి. మిత్రపక్షమా.. వైరీపక్షమా?.. ఇదేమీ పట్టించుకోకుండా పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్నాయి. ‘నాకు నీవు.. నీకు నేను!’ అనే ఫార్ములాను అనుసరిస్తూ మైత్రి కోసం సిద్ధమవుతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలో హస్తం, కమలం దోస్తీ కట్టేందుకు తహతహలాడుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో తన మిత్రపక్షం టీడీపీని కాదని కాంగ్రెస్ వెంట నడిచేందుకు బీజేపీ కౌన్సిలర్లు సిద్ధమవుతుండటంతో వింతరాజకీయం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మునిసిపల్ చైర్మన్ల ఎన్నికలో పరస్పరం సహకరించుకునే విధంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. గద్వాల, షాద్‌నగర్‌లో కాంగ్రెస్, అయిజలో టీఆర్‌ఎస్‌కు చైర్మన్ పదవి దక్కించుకునేందుకు స్పష్టమైన సంఖ్యాబలం ఉంది.
నారాయణపేటలో బీజేపీ సొంతబలం ఆధారంగానే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇతర పార్టీలపైన ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి.
మహబూబ్‌నగర్‌లో ఎంఐఎంతో కలిసి చైర్మన్‌పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తమకే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆరుగురు కౌన్సిలర్ల బలం ఉన్న బీజేపీ మద్దతుతో కౌన్సిల్ చైర్మన్‌ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు వనపర్తి మునిసిపాలిటీలో బీజేపీకి మద్దతు పలకాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య క్షేత్రస్థాయిలో చర్యలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నగర పంచాయతీల్లోనూ ఇదేరకమైన సహకారంతో ముందుకు సాగాలనే ప్రతిపాదన తెరమీదకు వస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల జిల్లా నాయకత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. రెండుచోట్లా వైస్‌చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది.
‘దేశం’తో అంగీకారం లేనట్లే!
వనపర్తిలో బీజేపీ సహకారంతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని భావిస్తున్న టీడీపీకి బీజేపీ నిర్ణయం ఆశనిపాతంగా మారింది. చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టినా టీడీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీలైనంత లబ్ధిపొందేందుకు కాంగ్రెస్‌తో వెళ్లడమే మేలని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ సహకరించుకుంటే వనపర్తి మునిసిపాలిటీ చైర్మన్‌గిరీతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో వైస్‌చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ లెక్కలు వేస్తోంది.
సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఎన్నికల అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులను బరిలోకి దించాయి. టీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగినా, బీజేపీ మాత్రం ఫలితం సాధించలేకపోయింది. సాధారణ ఎన్నికల సమయంలో ఇరు పార్టీల నడుమ పొత్తు కుదిరినా క్షేత్రస్థాయిలో శ్రేణుల నడుమ పూర్తిస్థాయిలో సమన్వయం కుదరలేదు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు లేనందున వనపర్తిలో టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదని బీజేపీ భావిస్తోంది.