సాక్షి, సిటీబ్యూరో: తహశీల్దార్ల అక్రమ బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన ఈ బదిలీల వ్యవహారం కొద్ది రోజులుగా హైదరాబాద్ కలెక్టరేట్‌ను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఇప్పటికే ఓ కేసు నడుస్తోండగా తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.
అమాత్యుల ఒత్తిళ్ల మేరకు గతనెలలో అక్రమ బదిలీలకు తలూపిన జిల్లా ఉన్నతాధికారులకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి అక్షింతలు తప్పడం లేదు. జిల్లా యంత్రాగం పనితీరును కిందిస్థాయి అధికారులు కొందరు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్న నేపథ్యంలో.. పాలనావ్యవస్థపై ఉన్నతాధికారులు పట్టుకోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజా కేసులో మూడు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
అక్రమంగా బదిలీ చేశారంటూ...
బండ్లగూడలో పనిచేస్తున్న తనను నిబంధనలకు విరుద్ధంగా చార్మినార్‌కు బదిలీ చేశార ంటూ తహశీల్దార్ అనిల్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో హైదరాబాద్ కలెక్టర్‌ను, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్‌ను, ప్రస్తుత బండ్లగూడ తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఎన్నికలకు ముందు నుంచి బండ్లగూడ తహశీల్దార్‌గా ఉన్న అనిల్‌కుమార్‌ను ఎన్నికల అనంతరం (వేరొకరికి పోస్టింగ్ ఇచ్చేందుకు) అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. తనను పక్కకు నెట్టి పైరవీతో వచ్చిన అధికారికి స్థానం కల్పించడాన్ని అనిల్‌కుమార్ అవమానంగా భావించిన ఆయన ట్రిబ్యునల్ ఆశ్రయించినట్టు సమాచారం.
అక్రమార్కులపై చర్యలేవీ?
ఎన్నికల మాటున జరిగిన అక్రమ బదిలీల విషయమై జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ త లంటినా, ఉన్నతాధికారులు మాత్రం అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల విధులు ముగించుకొని వచ్చేలోగా తమ స్థానాలను వేరొకరికి అప్పగించడంపై హైదరాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు తహశీల్దార్లు గత జూన్‌లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
ఇతర జిల్లాల నుంచి అక్రమంగా వచ్చిన తహశీల్దార్ల ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ట్రిబ్యునల్, జిల్లాకు చెందిన తహశీల్దార్లకు వారి పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను పట్టించుకోని అధికారులు.. పదవీ విరమణ పొందిన అధికారుల స్థానాల్లో వారిని సర్దుబాటు చేశారు. ఈ వ్యవహారంపై ట్రిబ్యునల్‌లో ఉన్న కేసు ఇంకా కొలిక్కి రాకముందే, తాజాగా చార్మినార్ తహశీల్దార్ పిటిషన్ వేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం సృష్టించింది.
కలెక్టరేట్‌ను కుదిపేస్తున్న అక్రమ బదిలీలు!
Published Wed, Jul 30 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement
Advertisement