సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఎత్తిపోతల ప్రాజెక్టుతో సూక్ష్మసేద్యాన్ని అనుసంధానం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో విజయవంతంగా అమలవుతున్న ఈ భారీ అనుసంధాన కార్యక్రమాన్ని తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని యోచిస్తున్నట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా పాలేరులోని సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎత్తిపోతల పరిధిలోని ఏదైనా ఓ గ్రామంలో వెయ్యి ఎకరాలను అనుసంధాన ప్రాజెక్టు పరిధిలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వరి కాకుండా ఇతరత్రా మెట్ట పంటలు సాగు చేసే భూములనే తీసుకుంటారు. పత్తి, మిరప, కూరగాయలు అధికంగా సాగు చేసే కూసుమంచి మండలంలో ఏదో ఒక గ్రామాన్ని తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏది అనువైన గ్రామమో పరిశీలించాలని ఆ జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించినట్లు సమాచారం.
ఇదో వినూత్న ప్రక్రియ
తక్కువ నీరున్న చోట మెట్ట పంటలను సాగు చేసేందుకు సూక్ష్మసేద్యాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. బోరు బావి లేదా ఇతరత్రా వనరుల నుంచి సూక్ష్మసేద్యం పరికరాల ద్వారా ప్రతి మొక్కకు నీరు అందించేలా ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో నీరు వృథా కాకుండా ఉంటుంది. గ్రీన్‌హౌస్‌లలో ప్రతి మొక్కకు నిర్ణీత స్థాయిలో నీరు పంపేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతకుమించిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతు బోరు బావి నుంచి కాకుండా ఎత్తిపోతల పథకం నుంచే వేలాది ఎకరాలకు ఒకేసారి సూక్ష్మసేద్యం ద్వారా నీటిని పంపించనున్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టుకు చెందిన భారీ పైపులకు సూక్ష్మసేద్యం పరికరాలను బిగించి వేలాది ఎకరాల్లోని మొక్కలను ఒకేసారి నీరందిస్తారు. ఇలా చేయడం వల్ల ఎత్తిపోతల నుంచి కాలువలకు, అటు నుంచి పొలాలకు అందించేటప్పుడు తలెత్తే వృథాను అరికట్టవచ్చు. పైగా సూక్ష్మసేద్యం నిర్వహణ భారం రైతులపై పడదు. రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో నీటి వనరులు తక్కువగా ఉండటం, మెట్ట పంటల సాగు అధికంగా ఉండటంతో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకోసం నాబార్డ్ నుంచి ఈ ఏడాది ఏకంగా రూ.వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేసుకునే రైతులకు మరింత సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగానే సూక్ష్మసేద్యం పరికరాలు ఏర్పాటు చేస్తోంది. బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఇతరులకు 80 శాతం సబ్సిడీతో అందజేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి రాగా.. ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేస్తే సామూహిక సూక్ష్మసేద్యం అందుబాటులోకి వస్తుంది. ఇక మున్ముందు కాలువల ద్వారా కాకుండా సూక్ష్మసేద్యం ద్వారానే పంటలకు నీరందించే ప్రక్రియ మొదలుకానుంది. ఎత్తిపోతలకు సూక్ష్మసేద్యం అనుసంధాన కార్యక్రమానికి పాలేరు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం వాస్తవమేనని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment