
ఆసుపత్రి రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ‘రోగులకు వైద్యం అందించడంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారు. సమయానికి విధులకు ఎందుకు హాజరు కావడం లేదు. కరోనా లక్షణాలతో పేషెంట్ ఆస్పత్రికి వస్తే ఏం ట్రీట్‌మెంట్ చేస్తారు.. ’ అని కలెక్టర్ సిక్తాపట్నాయక్ కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, హెడ్ సిస్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్ వస్తే కనీసం మీరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎవరూ సరిగా సమాధానం చెప్పకపోవడంతో మందలించారు. అసలు ఆసుపత్రిలో పీపీఈ సెట్లు, మాస్క్‌లు ఉన్నాయా అని ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు పనిచేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించని ఆస్పత్రి వైద్య సిబ్బందికి వెంటనే మమో జారీ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఫోన్‌లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంపత్ కలెక్టర్‌ను కలిసి ఆస్పత్రిలో వసుతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో కిషన్‌నాయక్, హెచ్‌ఈవో సుధాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment