శ్లాబులు, ప్లాస్టరింగ్ పూర్తయిన వనపర్తి నూతన కలెక్టరేట్ భవనం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురుడుపోసుకున్న కొత్త జిల్లాలకు కలెక్టరేట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ల క్రితమే భూమి పూజలు పూర్తయిన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులు గాడిన పడ్డాయి. కొన్ని జిల్లాల కలెక్టరేట్లు మాత్రం ఈ ఏడాది చివరి నాటికి పూర్తికానున్నాయి. గతేడాది కొత్తగా ఏర్పడ్డ ములుగు, నారాయణపేట, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో మాత్రం కలెక్టరేట్లను ఎక్కడ నిర్మించాలనే దానిపై స్పష్టత రాలేదు. 2016 దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం.. నూతన కలెక్టరేట్ భవన సముదాయాలకు శంకుస్థాపన చేసింది. వీటిని ఏడాది లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. భూసేకరణ సమస్యలు, ప్రజాప్రతినిధుల అభ్యంతరాలతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ బాలారిష్టాలను దాదాపుగా అధిగమించడంతో కొంతకాలంగా ఈ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో స్పీడు పెరిగింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మేడ్చల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల కలెక్టరేట్ కాంప్లెక్సులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్లాబులు కూడా పూర్తయిన ఈ భవనాల్లో పనులు చకచకా జరుగుతున్నాయి.
962 కోట్లతో నిర్మాణాలు
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో మాత్రమే కొత్త కలెక్టరేట్లు అవసరమని గుర్తించిన ప్రభుత్వం.. వీటి నిర్మాణానికి రూ.962 కోట్లను కేటాయించింది. ఈ మేరకు 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల విస్తీర్ణం, వనరులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 1.20 లక్షల చదరపు అడుగుల భవన విస్తీర్ణాన్ని నిర్దేశించింది. నిజామాబాద్, వరంగల్ (పట్టణ), కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని గుర్తించింది. దీని ఆధారంగానే భవన నిర్మాణ పనులను చేపట్టింది.
ఏడాదిలోపే ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో పనులను 11 ప్యాకేజీలుగా విభజించి.. కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే, స్థలాల ఎంపికలో పేచీలు, ఒక్కో కాంట్రాక్టర్‌కు రెండేసి, మూడేసి భవనాలను కేటాయించడంతో పనుల వేగం మందగించింది. కాగా ప్రస్తుతం నీటిపారుదల శాఖ భవన సముదాయంలో కొనసాగుతున్న వరంగల్ (గ్రామీణ) జిల్లా కలెక్టరేట్‌పై మాత్రం సందిగ్ధత వీడలేదు. ఎంపిక చేసిన స్థలం పట్టణానికి దూరంగా ఉండడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్న ప్రభుత్వం యూనివర్సిటీలో కొత్త భవనాన్ని నిర్మించే అంశాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు స్థల వివాదంతో పెండింగ్‌లో పడ్డ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన పనులు ఇటీవల ఊపందుకున్నాయి.
రంగారెడ్డిలోకి హైదరాబాద్!
రాజధాని నగరంలో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ త్వరలోనే కొత్త భవనంలోకి మారనుంది. ఈ భవనంలోకి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను వేరేచోటికి తరలించనున్నారు. కాగా, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఉన్న కలెక్టరేట్ల భవన సముదాయాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ గతంలో నిర్మించిన భవనాలు.. అవసరాలకు సరిపడా ఉండడంతో వాటినే కొనసాగించనుంది.
మరికొన్ని కొత్త భవనాల తాజా పరిస్థితి!
- సూర్యాపేట కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం కొనుగోలు విషయంలో వివాదం ఏర్పడింది. దీంతో సుమారు 6 నెలల పాటు పనులు ప్రారంభించలేదు. భూ వివాదం సమస్య తీరిన తర్వాత పనులు ప్రారంభించినప్పటికీ వేగంగా సాగడం లేదు. రెండు బ్లాకుల్లో మూడు ఫ్లోర్లలో మాత్రమే స్లాబ్‌ల నిర్మాణం అయింది. ఒక బ్లాక్ పూర్తిగా పిల్లర్ల దశలోనే ఉంది. ఇంకా ఈ పనులు పూర్తికావడానికి 6నెలలకు పైగా పడుతుందని అధికారులు చెబుతున్నారు.
- సిద్దిపేట జిల్లాలో భవనం నిర్మాణం వేగంగా జరుగుతోంది. నిర్మాణ పనులు శ్లాబ్ లెవల్‌కు చేరుకున్నాయి.
- నిజామాబాద్ కలెక్టరేట్ పనులు 70% వరకు పూర్తయ్యాయి. ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. వైరింగ్, లాన్‌ల ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాల పనులు జరగాల్సి ఉంది.
- భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 75% పనులు పూర్తి అయ్యాయి. లోపల ఎలక్ట్రికల్, ఇంటీరియర్ పనులు, బయట పార్కింగ్ ఏరియా, ప్రహరీ పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి.
- ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్‌లో చేపట్టిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు దాదాపు 80% పూర్తయ్యాయి. అన్ని అంతస్తుల శ్లాబులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- మెదక్ జిల్లా కేంద్రంలోని రామాయంపేట–మెదక్ ప్రధాన రహదారిలో ఔరంగాబాద్ శివారులోని దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.48.62 కోట్ల వ్యయంతో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పనులు 50% వరకు పూర్తయ్యాయి.
- మంచిర్యాల జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం నస్పూర్ మునిసిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్నారు. పనులను ప్రారంభించి ఏడాది పూర్తవుతున్నప్పటికీ.. కొంతమేర పిల్లర్ల దశలోనే ఉంది. మరికొంత శ్లాబ్ వేశారు.
- నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులు 10% కూడా పూర్తి కాలేదు. పునాదుల వరకే పరిమితమై ఆ తర్వాత నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పిల్లర్లు వేశారు.
- సిరిసిల్ల కలెక్టరేట్ నిర్మాణం పనులు 75% పూర్తయ్యాయి. దసరా నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- జగిత్యాల కలెక్టరేట్ నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయి. మరో 3నెలల్లో భవన నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
- పెద్దపల్లి కలెక్టరేట్ నిర్మాణ పనులు మరో 4నెలల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో 15 రోజుల్లో కలెక్టర్, జేసీ భవనాల ఇంటీరియర్ పనులు పూర్తవుతాయి. కామారెడ్డి కలెక్టరేట్ పనులు చివరి దశకు చేరాయి. భవనాల్లోని అంతర్గత పనులు కూడా పూర్తి కాగా, ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment