
కాలేజ్ భవనంపై నుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ అవంతి కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన తడ మల్లారెడ్డి కుమార్తె సంధ్యారాణి (21) హయత్‌నగర్ మండలం గుంతపల్లిలోని అవంతి కళాశాలలో బీటెక్ (ఎలక్ట్రానిక్స్) రెండో సంవత్సరం చదువుతోంది.
దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లింది. కొద్దిసేపటికే ఏడుస్తూ కళాశాల భవనం టైపైకి పరుగెట్టింది. విద్యార్థులు వారిస్తున్నా భవనంపై నుంచి దూకేసింది. తీవ్ర గాయాలైన ఆమెను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంధ్య ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సమస్యల వల్లే తాను ఇలా చేశానని సంధ్య కొన ఊపిరితో ఉన్నప్పుడు చెప్పిందని విద్యార్థులు చెబుతున్నారు.
చదువులో ఎప్పుడూ ముందంజే...
చిన్నతనంలోనే సంధ్య తండ్రి చనిపోయారు. కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని తల్లి శోభ కష్టపడి చదివించింది. సంధ్య కూడా అందుకు తగ్గట్లే చదువులో ముందుండేది. సంధ్య మరణ వార్త విని కుటుంబసభ్యులు, కళాశాల విద్యార్థులు సన్‌రైజ్ ఆసుపత్రికి తరలివచ్చారు. సంధ్యను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కుటుంబ సమస్యలేవీ లేవని, ఆమెను ఎవరో ఆత్మహత్యకు పురిగొలిపి ఉంటారని చెబుతూ తల్లి శోభ విలపించారు.