- తెగించి దుండగుడిని పట్టుకున్న యజమానురాలు
చిలకలగూడ: ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చిన దుండగుడు యజమానురాలిపై చాకుతో దాడిచేశాడు. ఆమె మెడలోని గొలుసుతెంపగా.. ఆమె అతనిని అడ్డుకుని స్థానికుల సాయంతో పట్టుకుని అప్పగించింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఉప్పరిబస్తీకి చెందిన ఎల్ సాయకుమార్, వాణి దంపతులు తమ ఇంట్లోని ఓ పోర్షన్ అద్దెకిచ్చేందుకు టు-లెట్ బోర్డు పెట్టారు.
లాలాపేట శాంతినగర్‌కు చెందిన పోతరాజు శ్రీకాంత్ (39) బుధవారం మధ్యాహ్నం వెళ్లి పోర్షన్ చూపించాలని వాణిని కోరాడు. ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి చూపించగా, మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఇంట్లో వాణి ఒక్కరే ఉన్నారని గ్రహించిన శ్రీకాంత్ నామాలగుండులోని ఓ దుకాణంలో కూరగాయలు తగిరే చాకును కొని, పది నిమిషాల తర్వాత నేరుగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. కిచెన్‌లో ఉన్న వాణిపై చాకుతో దాడిచేసి, ఆమె మెడలోని ఆరున్నర తులాల బంగారు గొలుసుకుని తెంపాడు. గాయాలపాలైనప్పటికీ ధైర్యంగా ప్రతిఘటించిన వాణి శ్రీకాంత్‌ను పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి శ్రీకాంత్‌ను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు.
బీకాం చదివిన శ్రీకాంత్ కార్ఖానాలో సెక్యూరిటీగార్డుగా పనిచేసి.. కొద్దిరోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. తన భార్య స్కూలు టీచరని, పిల్లల స్కూలు ఫీజు కోసమే దోపిడీకి పాల్పడ్డానని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.